ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మతం మారినా... పెద్దల మనస్సు మారునా..? - మతం మార్చిన ప్రేమ

ప్రేమ... రెండక్షరాల పదం... ఒక్కటిగా మారిన రెండు మనసుల ఆలోచన. ప్రేమ గురించి... రాస్తూ ఉంటే పేజీలు... చెబుతూ ఉంటే రోజులు గడిచిపోతూనే ఉంటాయి తప్ప అలసట, విరామం, అలుపు ఉండవనేది ప్రేమికుల వర్ణన. ప్రేమ, త్యాగం రెండూ జంట పక్షులేమో... ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ త్యాగం కచ్చితంగా ఉంటుంది. ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎల్లలు దాటడం చూశాం... కానీ ఈ ప్రేమకథ కాస్త భిన్నమైంది. ప్రేయసి కోసం వికారాబాద్​ జిల్లా యవకుడు బొబ్బిలి భాస్కర్ కాస్తా​ మహ్మద్​ అబ్దుల్​ హునైన్​గా మారాడు.

religion changed boy for love
ప్రియురాలి కోసం మతం మారి

By

Published : Jan 23, 2020, 12:24 PM IST

త్యాగాలతో కూడిన ఎన్నో ప్రేమ కథలు మనం విన్నాం.. చూశాం... తాజ్‌మహాల్‌ను నిర్మించి ప్రియురాలిపై తన గుండెల్లో ప్రేమను చాటుకున్న షాజహాన్‌... ఇప్పటికీ ఎందరో ప్రేమికులకు ఆదర్శం. మరీ అంతలా కాకపోయినా... అదే తరహాలో వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రియురాలిని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తన ప్రేమను గెలిపించుకునేందుకు దేశ రాజధానిలో 8 నెలల కఠోర శిక్షణ తీసుకుని ఇస్లాం మతం స్వీకరించాడు. ప్రియురాలి తల్లిదండ్రుల ఆదేశంతో ఖురాన్​ను ఆపోసన పట్టాడు.

ప్రేమ కోసం దిల్లీకి పయనం

మహ్మద్ అబ్దుల్ హునైన్.. వికారాబాద్​కి చెందిన ఇతని అసలు పేరు బొబ్బిలి భాస్కర్. డిగ్రీ చదువుకున్న ఇతడు స్థానికంగా ఓ కుటీర పరిశ్రమ నడుపుతున్నాడు. బాల్యం నుంచి ఒకే పాఠశాలలో చదువుకోవడం వల్ల ఓ ముస్లిం బాలికతో స్నేహం ఏర్పడి... మంచి స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనే జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు. అయితే వీరి పెళ్ళికి మతం అడ్డు వస్తోందన్నారు యువతి తల్లిదండ్రులు. మొదట్లో ఒప్పుకోకపోయినా ఇస్లాంలోకి మారితే పెళ్ళి చేస్తామని హామీ ఇవ్వటంతో... మతం మారి తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం దిల్లీకి వెళ్లి ఇస్లాం మత స్వీకరణ కోసం 8 నెలల పాటు శిక్షణ పొందాడు. అనంతరం తాండూరులోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ముస్లింగా మారినట్లు మత ధ్రువీకరణ పత్రాన్ని కూడా పొందాడు.

ప్రియురాలి కోసం మతం మారి...

ప్రియురాలితో అందమైన జీవితాన్ని ఊహించుకొని వికారాబాద్​కు తిరిగి వచ్చాడా యువకుడు. 'బొబ్బిలి భాస్కర్ అనే నేను మహ్మద్ అబ్దుల్ హునైన్​గా మారానని, ఈ పేరు కూడా ప్రియురాలే సూచించింది' అని చెబుతున్నాడు. కుమారుడి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అతనికి అండగా నిలిచారు. అమ్మ అంగీకారంతో ప్రేమ కోసం దేశ రాజధానికి పయనమయ్యాడు. శిక్షణ కష్టమైనా ప్రేయసి కోసం భరించాడు. ఊరిలో హేళన చేస్తున్నా పట్టించుకోలేదు. తిరిగొచ్చిన వెంటనే ప్రియురాలి తల్లిదండ్రులను కలిసి పెళ్ళి విషయమై చర్చించాడు. వారి వైఖరిలో మార్పు చూసి కంగుతిన్నాడు.

రక్షణ కల్పించాలి:

నేటి సమాజంలోని యువత ప్రేమలపై.. నమ్మకం పోతోన్న ఈ రోజుల్లో... ప్రేయసి కోసం ఏకంగా మతాన్నే మార్చుకోవడం సాహసమనే చెప్పాలి. మత మార్పిడి కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని... పెళ్ళికి అంతా సిద్ధం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు భాస్కర్​. గతంలో ఇస్లాంలోకి మారితే వివాహం చేస్తామన్న ప్రియురాలి తల్లిదండ్రులు... ఆ యువకుడిని చూసి నువ్వు ఎవరో మాకు తెలియదన్నారు. ఊహించని పరిణామంతో యువకుడు నిర్ఘాంతపోయాడు. ఇద్దరికీ కలుసుకునే అవకాశం లేకుండా చేసి... అమ్మాయిని బంధువుల దగ్గర నిర్బంధించారు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా రోజూ తన కోసం తిరుగుతూ... ఆరా తీస్తుండటంతో విసిగిపోయిన యువతి కుటుంబ సభ్యులు అతణ్ని చితకబాదారు. ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాడా ప్రేమికుడు. తన గోడు వెళ్లబుచ్చి... న్యాయం చేయాలని అర్థిస్తున్నాడు. ప్రేమించిన యువతితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకోవాలని... తామిద్దరికీ ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్​ఆర్​సీని వేడుకున్నాడు ఈ ప్రేమికుడు.

ప్రియురాలి కోసం మతం మారిన భాస్కర్​కి​ ప్రేమ దక్కుతుందా...? ప్రేమ కోసం ఇస్లాం స్వీకరించిన హునైన్​ తన ప్రేయసిని పొందుతాడా...? మానవ హక్కుల సంఘం ద్వారా ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందా...? అనేది వేచి చూడాల్సిందే.

ఇవీ చూడండి:

పాఠశాలలో పోలీసులు... ఆరుబయట విద్యార్థులు..!

ABOUT THE AUTHOR

...view details