Hanmakonda Accident : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. ఏ పూట కూలీ ఆ పూటకే సంపాందించుకునే పరిస్థితులు. మిర్చి తోటల్లో కాయలు ఏరే సీజన్ వచ్చిందంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని సంబురపడ్డారు. మిరప తోటకు వెళ్లేందుకు ఉదయాన్నే ఇంట్లో పనులు చక్కబెట్టుకుని పిల్లలను బడికి పంపించి.. భర్తలను పనికి పంపి సద్ది పట్టుకుని పక్కన ఊళ్లో ఉండే మిరప తోటకు ట్రాలీ ఆటోలో బయలుదేరారు. కుటుంబ పరిస్థితులు.. భవిష్యత్‌పై ఆలోచనలు.. పిల్లల గురించిన ఆశలు ఇలా కష్టనష్టాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ నాలుగు కాయలు ఎక్కువ తెంపి నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించుకోవాలని ఆశపడ్డారు.
Hanmakonda Accident Today :అంతలోనే మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎదురుగా దూసుకొచ్చిన లారీ ట్రాలీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. అంతా చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరి కాళ్లు, చేతులు తెగి చిందరవందరగా పడ్డాయి. అప్పటిదాకా తమతో మాట్లాడిన వాళ్లు.. చేతులు తెగి, కాళ్లు విరిగి రక్తపు మడుగుల్లో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఆ లారీ ధాటికి అక్కడికక్కడే కన్నుమూశారు. త్వరగా పని ముగించుకుని ఇళ్లకు వెళ్దామనుకున్న వాళ్లంతా ఇలా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కొందరేమో అనంతలోకాలకు వెళ్లారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం.. కూలీల జీవితాలను కకాలవికలం చేసింది. కొందరి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడితే.. మరికొందరి ప్రాణాలను బలితీసుకుంది.