Ganesha idols: గణపతి పండగ వచ్చిందంటే చాలు కళాకారుల సృజనకు రెక్కలు విచ్చుకుంటాయి. అలాంటి సృజనాత్మకతో రూపొందించిన విగ్రహమే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మెయిన్ బజారులో కొలువుదీరనున్న స్వర్ణలక్ష్మి మహాగణపతి. నిర్వాహకులు హైదరాబాద్‌లో కోల్‌కతా కళాకారులతో ప్రత్యేకంగా ప్రతిమను తయారు చేయించారు. తంజావూరు, తిరుపతికి చెందిన కళాకారులు బంగారపు పూతతో ఉన్న లక్ష లక్ష్మీ కాసులతో ప్రతిమకు అలంకరణ చేశారు. కెంపులు, పచ్చలు, అమెరికన్ వజ్రాలూ అలంకరణకు ఉపయోగించినట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ పొట్టి రత్నబాబు తెలిపారు.
బాపట్ల జిల్లా కళాకారుడు వివిధ పదార్ధాలతో గణనాథుని కళాకృతులు తయారు చేసి భక్తిని ప్రదర్శించారు. సజ్జావారి పాలెంకు చెందిన వల్లభనేని సత్య సాయిబాబు నిత్యం వినియోగించే... కూరగాయలు, బాదం, ఉల్లిపాయలు, జీడిపప్పు, వెల్లుల్లిలతో బోజ్జగణపయ్యను తయారు చేశారు. వివిధ రకాల వినాయకుడి కళాకృతులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పాత బస్తిలో వినాయక చవితి సందర్భంగా 10 వేల కూల్డ్రింకు సీసాలతో ఏర్పాటు చేసిన 16 అడుగుల గణపయ్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉమాపతి సేవాసమితి 56వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతపురం జిల్లా కొట్టువారిపల్లికి చెందిన గణేశ్ రాయల్ అనే విద్యార్థి న్యూస్‌పేపరు, మైదాపిండితో 16 అడుగుల అందమైన వినాయక ప్రతిమను తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం రెండు నెలలు శ్రమించాడు. గణేశ్ తయారు చేసిన ప్రతిమనే గ్రామంలోని వినాయక మండపంలో ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జొజ్జ వెంకటరమణ, మలేశ్వరి దంపతుల కుమారుడు గణేశ్ మదనపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు.