ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇక నెలవారీగా ఫెలోషిప్‌.. జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ విద్యార్థులకు చెల్లింపు - ఏపీ తాజా వార్తలు

దేశవ్యాప్తంగా పరిశోధన విద్యార్థులకు ఇక నుంచి నెలవారీగా ఫెలోషిప్‌ నగదు అందనుంది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌) కింద ఎంపికైన వారికి ప్రతినెలా నగదు మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మేరకు తాజాగా యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Longer Fellowship
Longer Fellowship

By

Published : Dec 14, 2020, 6:48 AM IST

పరిశోధన విద్యార్థులకు ఇక నుంచి నెలవారీగా ఫెలోషిప్‌ నగదు అందనుంది. ఇప్పటివరకు ప్రతి మూణ్నెల్లకు ఒకసారి ఫెలోషిప్‌లను చెల్లిస్తున్నారు. జేఆర్‌ఎఫ్‌ కింద నెలకు రూ.31 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి రూ.35 వేలు అందజేస్తున్నారు. పరిశోధన విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నెలవారీగా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ తెలిపింది. ఇన్‌స్పైర్‌ ఉపకార వేతనం అందకపోవడం వల్ల దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్యారెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపకార వేతనాలను గతానికి భిన్నంగా నెలవారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

విద్యార్థులకు ఈ అక్టోబరు నెల వరకు ఫెలోషిప్‌లను చెల్లించామని, నవంబరు నగదును కూడా త్వరలో విడుదల చేస్తామని యూజీసీ పేర్కొంది. ఏటా ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టుల కోసం యూజీసీ-నెట్‌, సైన్స్‌ సబ్జెక్టులకు యూజీసీ సీఎస్‌ఐఆర్‌-నెట్‌ పేరిట పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్ష రెండుసార్లు జరుపుతారు. యూజీసీ నెట్‌లో ఏటా రెండు విడతల్లో 10 వేల నుంచి 12 వేల మంది, సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో 5 వేల మంది ఫెలోషిప్‌లకు అర్హత సాధిస్తారు. వారే మొదటి రెండేళ్లపాటు జేఆర్‌ఎఫ్‌, తర్వాత మూడేళ్లపాటు ఎస్‌ఆర్‌ఎఫ్‌ కింద ఫెలోషిప్‌ నగదు అందుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటివారు 50 వేల మంది ఉంటారు. తాజాగా 2020 జూన్‌ యూజీసీ నెట్‌లో 5.26 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 6,171 మంది జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించారు.

ఇదీ చదవండి:కరోనాకు తోడైన కల్తీ.. ప్రమాదకరంగా ఆహారం

ABOUT THE AUTHOR

...view details