అబద్ధాలు, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ అవిభక్త కవలలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. పసి బిడ్డగా ఉన్నప్పుడే అమరావతిని చంపేయడానికి వైకాపా చేసిన కుట్రలు అందరికి తెలిసినవేనని దుయ్యబట్టారు. పంట తగలబెట్టడం, నిధులు ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్‌కు మెయిల్స్ పంపటం, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వొద్దు అంటూ సింగపూర్ ప్రభుత్వానికి దొంగ మెయిల్స్ పెట్టడం.. ఇలా అమరావతికి అనేక అడ్డంకులు కలిగించారని లోకేశ్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ బుద్దిలో మార్పు రాలేదని లోకేశ్ ఆక్షేపించారు.
నీరు, ప్రకృతి వైపరీత్యాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం, భూమి లభ్యత, ప్రాంతీయ అభివృద్ధిని సూచికలుగా తీసుకుని శాస్త్రీయ పద్దతిలో శివరామక్రిష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో చాలా స్పష్టంగా కృష్ణా,గుంటూరు జిల్లాలు రాజధాని ఏర్పాటుకు అనుకూలం అని చెప్పారన్న లోకేశ్... ఆ నివేదిక తాలుకు వివరాలనూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చట్టబద్ధత ఉన్న నివేదిక అన్నారు.