తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకే కొత్త పేర్లు పెట్టి... ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గతంలో చంద్రబాబు 'ముఖ్యమంత్రి ఈ - ఐ కేంద్రాలు' ఏర్పాటు చేసి... పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసే కార్యక్రమం అమలు చేశారని గుర్తు చేశారు. ఆ పథకానికే పేరు మార్చి... కొత్త కార్యక్రమమంటూ... జగన్ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని ట్విటర్లో ఎద్దేవా చేశారు.
ఇప్పటికే ఆ కేంద్రాల సేవలను 10 లక్షల 80వేల మంది వినియోగించుకున్నారని లెక్కలతో సహా వివరించారు. ఈ విషయం స్వయంగా జగన్ ప్రభుత్వంలో ఉన్న 'ఆరోగ్య ఆంధ్ర'నే చెప్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజలను ఎలా మభ్యపెడతారనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ''జగన్ గారూ... ఇప్పటికే ఉన్న పథకాలపై బిల్డప్ ఇవ్వకుండా... నవరత్నాల సంగతి చూడండి'' అని హితవు పలికారు.