అనంతపురం జిల్లా ఎర్రవంకపల్లిలో మైనర్పై అత్యాచారానికి పాల్పడిన ఆదినారాయణను వైకాపా నాయకులు కాపాడే యత్నం చేయటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. బాలికకు న్యాయం చేయాల్సిన నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నేరస్థుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బాధితురాలిని, బంధువులను పోలీసు స్టేషన్ ముందు నిలబెట్టి రేపిస్ట్ని రాజమార్గంలో విడుదల చేయటం ఘోరమని ఆక్షేపించారు. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మహిళలకు ఏ మాత్రం రక్షణ ఉందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.