సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షల్ని రద్దు చేసిన తరహాలోనే రాష్ట్రంలోనూ నిర్ణయం తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు విద్యార్థుల ఆరోగ్యానికి, జీవితానికి ప్రాధాన్యం ఇచ్చిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తూ సీఎంకు లేఖ రాశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్రం, ఇతర రాష్ట్రాలు పరీక్షలకు ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించి ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేశాయని గుర్తు చేశారు. కరోనా కారణంగా పిల్లల్ని పరీక్షలకు పంపేందుకు తల్లిదండ్రులు మానసికంగా సిద్ధంగా లేరన్నారు. మే నెల చివరి రెండు వారాల్లో 10శాతం కంటే ఎక్కువగా 18ఏళ్లలోపు పిల్లలపై కరోనా ప్రభావం చూపిందన్న లోకేశ్.. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేలా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం మొండిపట్టు పట్టడం తగదని హితవు పలికారు.
LOKESH LETTER: సీఎంకు నారా లోకేశ్ లేఖ.. పది, ఇంటర్ పరీక్షల రద్దుకు డిమాండ్!
ముఖ్యమంత్రికి జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే.. ఇక్కడా పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయని గుర్తు చేశారు.
ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా 80లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండటం దుర్మార్గమని విమర్శించారు. రక్షణ, ఇతర రంగాల్లో ఉద్యోగాల దరఖాస్తుకు విద్యార్థులకు సకాలంలో మార్కులు విడుదల చేయాల్సి ఉన్నందున విద్యాసంవత్సరం నష్టపోకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తాను నిర్వహించిన వర్చువల్ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం లేఖకు లోకేశ్ జతచేశారు.
ఇదీ చదవండి:10th, Inter Exams: పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు: మంత్రి సురేశ్