పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పోలవరం, స్థానిక ఎన్నికలు, వరద బాధితుల సాయంపై మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర పెద్దల్ని కలుస్తున్న సీఎం జగన్...ఎందుకు కలుస్తున్నారో ఎప్పుడైనా ప్రజలకు చెప్పారా అని ప్రశ్నించారు. పోలవరం అంచనాలు ఎందుకు తగ్గాయో..సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏకగ్రీవాలు సాధ్యం కావనే
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో..అభ్యర్థులను ప్రలోభ పెట్టి, దౌర్జన్యం చేసి ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకగ్రీవాలు సాధ్యం కాదనే ఉద్దేశంతో ఎన్నికలను జరపడానికి వెనక్కి తగ్గుతున్నారన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా పోటీకి సిద్ధంగా ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.
రాత్రి వరకూ సాగిన పర్యటన
తణుకు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన...సోమవారం రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగింది. ఫ్లడ్ లైట్ వెలుగులతో వరద ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో ప్రారంభమైన లోకేశ్ పర్యటన.. అక్కడ నుంచి కొమ్మర ఉరదాళ్ళపాలెం, తిరుపతిపురం ఒరిగేడు మీదుగా దువ్వ వరకు కొనసాగింది. పర్యటన ఆద్యంతం ముంపు బారిన పడిన పంట పొలాలను, నివాస ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని భరోసా కల్పించారు.