అమలాపురంలో వైకాపా రాక్షసులపై బైరిశెట్టి రేణుక చేస్తున్న పోరాటానికి అన్నగా అండగా ఉంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రేణుక ధైర్యానికి సలామ్ అంటూ ట్వీట్ చేశారు. తనకు అన్యాయం జరిగిందని కేసు పెడితే ఈ రోజు వరకూ చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పుబట్టారు. బుల్లెట్ లేని జగన్ ఎక్కడ అని నిలదీశారు. స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడేందుకు రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. 21 రోజుల్లో బాధిత మహిళకు న్యాయం అని చెప్పుకుంటుంటే... 21 నెలలైనా ఒక్క మహిళకూ న్యాయం జరగలేదని మండిపడ్డారు.
జగన్ రెడ్డి హయాంలో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదు అంటూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రేణుకను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేణుకకు సంబంధించిన ఓ వీడియో సందేశాన్ని లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు. అందులో తనకు జరిగిన అన్యాయంపై రేణుక ఏడుస్తూ విలపించింది.