కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాల ఏర్పాటు వ్యవహారం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఆకార్యాలయాలుకర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం అంతిమం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి ఐకాస నేత, డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాదబాబు వాదనలు వినిపించారు. కర్నూలులో లోకాయుక్త , ఏపీ హెచ్ ఆర్సీ ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపున వాదించారు.
ఏపీసీఆర్డీఏ చట్ట ప్రకారం రాజధాని నగరం అమరావతి గ్రామాల పరిధిలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు. విధులు నిర్వహిస్తున్నాయన్నారు. పరిపాలనకు సంబంధించిన శాసన, న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు రాజధానిలో ఉండాలన్నారు . అప్పట్లో ప్రభుత్వం అమరావతిలో న్యాయనగరం ఏర్పాటుకు ప్రతిపాదించింది. భూములు కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన విభాగాలన్నింటిని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనానికి తెలిపారు. న్యాయనగరాన్ని ప్రకటించాక రాష్ట్రస్థాయి జ్యుడీషియల్, క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థలను రాజధాని ప్రాంతంలో ఉంచాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యాక .. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకు వచ్చారన్నారు. ఆ చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది . ఈ నేపథ్యంలో కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటు సరికాదని తెలిపారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని అలాంటి ప్రాంతాన్ని వదిలేసి దూరంగా ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయడం న్యాయాన్ని ప్రజలకు దూరం చేయడమేనన్నారు. విజయవాడలో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం రూ .1.42 కోట్లు ఖర్చుచేసిందన్నారు. భవనం సిద్ధంగా ఉంది , కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద సహేతుకమైన కారణాలు లేవన్నారు. ఇంకా కర్నూలులో హెచ్ ఆర్సీ ఏర్పాటు చేయలేదన్నారు. దాని ఏర్పాటుపై స్టే ఇవ్వండి ' అని కోరారు.
ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చడంపై ధర్మాసనం ప్రశ్నించగా .. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రతివాదులుగా పేర్కొన్నామని, న్యాయస్థానం వారికి నోటీసులు జారీచేసిందని న్యాయవాది బదులిచ్చారు.