Lok Sabha Speaker on Bandi Sanjay: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంజయ్ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది.
జాగరణ దీక్ష ఉద్రిక్తం...
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌కు దారితీశాయి. సోమవారం పోలీసులు సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. సంజయ్‌ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.