స్వాతంత్య్రానికి పూర్వం కరాచీలోని ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చిలో ఎంటమాలజిస్ట్ రావు సాహిబ్ వై.రామచంద్రరావు మిడతలపై పరిశోధనలు నిర్వహించారు. 1935 జులైలో పరిశోధనా పత్రాన్ని వెలువరించారు. అందులో..‘‘అసాధారణ పరిస్థితుల్లో ఎడారి మిడతలు దక్షిణాది దాకా ఎగురుతాయి. ఈ దండుల కారణంగా కరవొచ్చిందనే అంశం వేదాలు, బైబిల్‌లోనూ ఉంది. మిడతల దండు కిలోమీటర్ల దూరం విస్తరిస్తూ.. ముందుకు కదిలే సమయంలో.. సూర్యుడూ కనిపించని పరిస్థితి ఉంటుంది’’అని వివరించారు. ఆయన పరిశోధనలోని మరికొన్ని ముఖ్యాంశాలు...
మూడో రకంతోనే నష్టం
*మిడతల్లో ఎన్నో రకాలున్నా మూడు రకాలతోనే సమస్యలున్నాయి.
*మొదటిది సాధారణ మిడతలు.. ఇవి చిన్న గుంపులుగా ఏర్పడి అన్ని చోట్లా కన్పిస్తుంటాయి. నష్టం పరిమితం.
*రెండోది బొంబాయి మిడతలు.. ఇవి గుజరాత్, మధ్య భారత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. పెద్ద నష్టం ఉండదు.
*మూడోది ఎడారి మిడతలు.. ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి రాజస్థాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి.
*మిడతల దండు బాగా ఉద్ధృతమైన సందర్భాల్లో .. మధ్య భారతదేశం వరకు వచ్చింది.
*అసాధారణ పరిస్థితుల్లో.. తూర్పున అసోం, దక్షిణాన మద్రాస్ దక్కన్ ప్రాంతం వరకు చేరే అవకాశం ఉంది.