ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మిడతల రోజు ప్రయాణం 130 కిలోమీటర్లు... ఈ జాగ్రత్తలు పాటించాలి!

By

Published : May 29, 2020, 10:05 AM IST

కరోనా కల్లోలం నేపథ్యంలో అన్ని రంగాలు ఉక్కిబిక్కిరి అవుతున్న వేళ.. ప్రత్యేకించి వ్యవసాయ రంగం, రైతాంగాన్ని మిడతల దండు వణికిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో దేశంలోకి ప్రవేశించిన ఈ రాకాసి దండు తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నాయి. నిజానికి అవి దిశ, గమనం మార్చుకోవచ్చు. ఏ దిశగా వెళ్తాయో చెప్పడం కష్టం. ఆ మిడతల దండయాత్ర దిశ ఎలా ఉండబోతున్నది అంచనా వేయలేమని ఇక్రిశాట్ మొక్కల సంరక్షణ విభాగం ఇంఛార్జ్​, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్ సూదిని అన్నారు. మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు రావచ్చు... రాకపోవచ్చు... ఏదైనా ఇదొక పెను ముప్పేనంటున్న ఆయనతో "ఈటీవీ భారత్‌-ఈనాడు" ముఖాముఖి.

locust-travel-130-km-daily-some-precautions-must-be-followed
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

డాక్టర్​ హరికిషన్​తో ముఖాముఖి..!

కరోనాతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణంలో... మిడతల దండు కూడా భీభత్సం సృష్టిస్తోంది. అసలు అవి ఎలా పుట్టుకొస్తున్నాయి ?

మీరన్నట్లు కరోనా ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యమైన వ్యవసాయ రంగం, రైతాంగంపై సైతం విపరీతమైన ప్రభావం చూపుతోందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో మిడతల దండు రాబోతుందని వినడం ఆందోళన కలిగించే అంశం. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు చూసినట్లైతే. సెంట్రల్, ఈస్ట్ ఆఫ్రియా నుంచి మొదలైన ఈ దండు మిడిల్ ఈస్ట్‌ మీదుగా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర మీదుగా తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నట్లు సమాచారం వస్తోంది. ముఖ్యంగా ఈ మిడతల దండు అనేది ఇలా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణంలో జరిగే మార్పులై ఉండవచ్చు. ఈ కీటకంలో కొన్ని హర్మోన్ల మార్పుల వల్ల వలసలకు తోడ్పాటు అందిచ్చవచ్చు. అంతేకాదు ముఖ్యంగా అవి ఎక్కడైతే పుట్టాయో అక్కడ సరైన ఆహారం దొరక్కపోవడం వల్ల కూడా అవి ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.

ఇరాన్‌, బలూచిస్తాన్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టిన మిడతలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వ్యవసాయ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుండటం వల్ల రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. గత 27 ఏళ్లల్లో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ?

ఇప్పుడు పర్యవసానాల గురించి ఆలోచించినట్లైతే... ఈరోజు ముఖ్యంగా మే చివరి వారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రవేశిస్తే మాత్రం అంతగా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. స్టాండింగ్ క్రాప్స్‌ అనేవి ఎక్కువగా మనకు లేవు. ఈ ఏడాది రబీ సీజన్‌లో వేసిన పంటలన్నీ కోతలు, నూర్పడి ప్రక్రియ పూర్తైంది. కాబట్టి మనకు పెద్దగా నష్టం జరిగే అవకాశం తక్కువ అని చెప్పాలి. కాకపోతే... ఇంకా ఆలస్యమైతే... ఉదాహరణకు జూన్‌ చివరి వారం లేదా జులై మొదటి వారంలో మిడతల దండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తే అప్పుడు నాటే, విత్తు విత్తే దశలో ఉండే 25 నుంచి 30 రోజుల వరి, పత్తి, పప్పుధాన్యాలు, ఇతర పంటలకు మాత్రం విపరీతమైన నష్టం కలిగే అవకాశం ఉంది.

పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతల దండు.. వాయు వేగంతో ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్థాన్‌లో అత్యవసర పరిస్థితి విధించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా గట్టెక్కగలం ?

ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే మన ముందున్న ఏకైన మార్గం ఒక్కటే. సైనిక విధానం, సామూహిక, సమన్వయ విధానం. ఇది ఏదో ఒకరిద్దరు రైతులకు సంబంధించిన విపత్తు కాదు. ఒక గ్రామానికి సంబంధించింది కాదన్న భావనతో... రైతులతో కలిసి సమన్వయంగా వ్యవసాయ శాఖ నిరోధానికి నడుం బిగించాలి. తద్వారా కొంత వరకు సమర్థవంతంగా ఈ మిడదల దండు బారి నుంచి వ్యవసాయ, ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్షేత్రస్థాయి మనకున్న పరిస్థితులను బట్టి ఈ సమన్వయ విధానం నిర్వహణ పద్ధుతులు అవలంభించాల్సి ఉంటుంది. ఇది వ్యవసాయ శాఖ, రైతుల సమన్వయంపై ఆధారపడి ఉంటుంది.

ఉత్తర భారతంలో మిడదల దండయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో పంటలు సర్వనాశనం అవుతున్న దృష్ట్యా... నష్ట నివారణ కోసం రైతులు తమ వంతుగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

కేవలం రసాయనాలు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతామనుకోవడం తప్పు. ఎందుకంటే రసాయనాలు అన్ని చోట్ల మనం పిచికారీ చేయలేం. మేనేజ్‌మెంట్ అప్రోచ్‌లో రసాయనాలు అనేవి ముఖ్యమైన భాగంగా మాత్రమే ఉంటాయి తప్ప... కేవలం రసాయనాలను నమ్ముకుని మిడతల దండు నుంచి మనల్ని మనం కాపాడుకోలేం. రసాయనాలతోపాటు సమూహంగా అనేక ఇతరత్రా నిర్వహణ పద్ధతులు, మెళకువలు అవలంభిస్తే మిడతల దాడి నుంచి కాపాడుకోవచ్చు. ఉదాహరణకు మిడతల దండు అనేది నాన్ క్రాప్డ్‌ ఏరియాలో ల్యాండ్ అయినప్పుడు మాత్రం రసాయనాల పిచికారి పద్ధతి ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. అదే క్రాప్ ల్యాండ్ ఏరియాలో... ఉదాహరణకు మామిడి, బత్తాయి పంటల్లో దిగినప్పుడు ఆ రకంగా రసాయనాలు ఉపయోగించకూడదు. ఆ సమయంలో పెద్ద శబ్ధాలు చేయడం, డ్రమ్స్, డప్పులు వాయించడం ద్వారా ఆ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మిడతల దండును పంపేయవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యూహాత్మక చర్యలు పాటించి మంచి ఫలితాలు పొందచ్చు.

ఈ పరిణామం ఇతర రాష్ట్రాలను సైతం వణికిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐసీఏఆర్ సంస్థలు, శాస్త్రవేత్తలు ఎలాంటి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటారు ?

మనకు మిడతల దండు రాక హెచ్చరికలు అనేవి ముఖ్యం. ఈ కదలికలు ఎలా వస్తున్నాయి...? ఎక్కడ్నుంచి వస్తోంది...? దాన్ని గమనం ఎలా ఉంది...? ఈ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎలా కదిలి కొనసాగుతుంది...? వంటివన్నీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఆర్ అనుబంధ సంస్థ, రాష్ట్ర వ్యవసాయ శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసినట్లైతే... అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ తగిన చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సమాచారం అత్యంత కీలకం.

సాధారణంగా ఒక మిడత 2 గ్రాముల ఆహారం తింటుంది. ఒక సమూహాం దాదాపు 35 వేల మంది జనాభా తినే ఆహారాన్ని భక్షిస్తుందంటున్నారు...? ఈ ముప్పును ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు?

నిజమే... మీరన్నట్లు ఒక మిడత తన బరువుకు సమానంగా ఆహారం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా అవి ఒకటి రెండు రావు. వచ్చేటప్పుడు కొన్ని మిలియన్లు చొప్పున వస్తాయి. అవి ఒక వృక్ష సంపదపై పడినప్పుడు విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

ఒక మిడత గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే రోజుకు 130 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది...? పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు... ప్రత్యేకించి తెలంగాణకు ఏ మేరకు ప్రమాదం పొంచి ఉందంటారు...?

తప్పకుండా మనం ప్రమాదం అంచునే ఉన్నాం అని చెప్పుకోచ్చు. ఇది తెలిసి ఎలా బయటపడాలన్ని అంశంపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఆ దృష్టిలో భాగంగా నిఘా, పర్యవేక్షణ చాలా ముఖ్యం. మిడతల దండు ఏ డైరెక్షన్‌లో వస్తోంది...? ఎక్కడ ల్యాండ్ అవుతుంది...? ఎటు వైపు కదిలి వెళ్తుంది...? ఈ మొత్తం ఎపిసోడ్‌లో నిఘా అనేది అత్యంత కీలకం. అది మనం తెలుసుకున్నట్లైతే తదనుగుణంగా ఎలాంటి నిర్వహణ పద్ధతులు అవలంభించాలనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు.

ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో 8 వేల కోట్ల రూపాయల విలువైన పెసర పంట నాశనమైంది. అలాగే... ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఒకేసారి వస్తే మనం ఎలా ఎదుర్కోగలం...?

నిజంగా ఇది కష్టమైన సమస్యే. కాకపోతే దీనకంటూ ఒక నమూనా ఉంటుంది. ఈ మిడతల దండు అనేది ఒకేసారి ఒకే రోజు దేశం అంతటా పాకే పరిస్థితి ఉండదు. ఒక పద్ధతి ప్రకారం... నమూనా ప్రకారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అలా అలా వస్తూ ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఇంకో ఏరియాలో ఇతర నిరోధక ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఆ ఏరియా నుంచి మరో ఏరియా వెళ్లకుండా నిరోధించవచ్చు. ఇలాంటి పద్ధతుల ద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుంది.

అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన పంటలను మనం కాపాడుకోలేమా...? మన ముందున్న సవాళ్లు ఏంటి...? అవి ఎలా అధిగమించవచ్చు...?

తప్పకుండా మన పంటలను మనం కాపాడుకోవచ్చు. ఈ కీటకం అనేది తీవ్రమైన నష్టం చేస్తుందనేది సత్యం. అదే సమయంలో నిర్వహణ చేయలేమని చెప్పలేం. ఇది నిర్వహణ సామర్థ్యం గల చీడ అని స్పష్టంగా చెప్పగలం. క్రిమిసంహారకాలు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కాస్త తక్కువ ధరల్లో లభించే క్వినాల్‌ఫాస్‌, క్లోరోఫైరిపాస్‌ కాకుండా నీమ్ బేస్డ్ బయో ఫార్ములేషన్స్ పంటపై పిచికారీ చేసుకున్నట్లైతే... ఆ పైరును మిడతలు తినేయకుండా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నిర్వహణ ప్రక్రియ అనేది అక్కడ నుంచి మరో ప్రదేశానికి వెళ్లిపోవడానికి దోహదం చేస్తుంది.

అయితే... ఇప్పుడున్న భారత్‌లో ఉన్న సవాళ్లు ఏంటి...? ఆహార, ఆహారేతర పంటలు, పశుగ్రాసాలపై దాడి చేస్తే ఎలా నిర్మూలించుకోవచ్చు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముందున్న సవాళ్లు కూడా ఏంటి...?

ఇప్పుడు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఒకేసారి మిడదల దండు దాడి చేసి విపరీతమైన పంట నష్టం చేస్తుందనుకున్నప్పుడు సంప్రదాయ పద్ధతులు అవలంభించాలి. ఒకరిద్దరు రైతులు క్షేత్రాలకు వెళ్లి పిచికారీ చేయడం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పుంతలు తొక్కుతున్న మానవరహిత డ్రోన్ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. పెద్ద ఎత్తున కీటన నాశినిల కోసం డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం, పోలీసు శాఖ అనుమతి తీసుకుని ఈ కొత్త సాంకేతి పరిజ్ఞానం వాడుకోవడం ద్వారా భారీ స్థాయిలో పిచికారీ కోసం వెళ్లినట్లైతే ఒకేసారి పెద్ద ఎత్తున మిడతల దండును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది.

ఇవి ఎక్కడ పచ్చదనం కనిపిస్తే అక్కడ వాలిపోతాయి. భవనాలు, వృక్షాలపై కూడా వచ్చి మిడతలు దండు నిలిచే లక్షణం ఉన్న దృష్ట్యా... ఎలా నిరోధించుకోవచ్చు...?

వాస్తవంగా చెప్పాలంటే... మిడతల దండు వృక్షాలపై వాలవచ్చు. పంట సాగేతర భూముల్లో ఎక్కడ పచ్చ గడ్డి ఉంటే అక్కడ కూడా వాలవచ్చు. ఎక్కడ పంట ఉంటే కూడా అక్కడ ల్యాండ్ అవ్వొచ్చు. అంతేకాదు ఎక్కడ పచ్చదనం, మొక్కలు, వృక్ష సంపద కనిపించినా కూడా అవి వాలడం సహజ లక్షణం. ఎక్కడ వాలుతాయి అనే దాన్ని బట్టి మనం సస్య రక్షణ, యాజమాన్య చర్యలు పాటించేందుకు డిజైన్ చేసుకోవచ్చు.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మిడతల దండు తెలుగు రాష్ట్రాల కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఆ పరిస్థితిని ముందస్తుగా నివారించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖలు ఎలాంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలంటారు...?

ముందస్తుగా అంటే ముఖ్యంగా పటిష్ట నిఘా, పర్యవేక్షణ అవసరం. ఈ మిడతల దండు ఎటువైపు నుంచి ఎటువైపు వస్తున్నాయనేది ముఖ్యమైన సమాచారం అత్యంత తక్కవ సమయంలో వ్యవసాయ శాఖకు చేరాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ కార్యాచరణకు సిద్ధం కావడానికి దోహదపడుతుంది. ఆ సమాచారం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ నష్టం చేసి మిడతల దండు ఈ ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోతాయి. మిడతల దండు రాకపై రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, కేవీకేలు, హెచ్చరిక కేంద్రాలు సత్వరం వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వడం చాలా కీలకమైన అంశం అని చెప్పచ్చు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల అప్రమత్తమయ్యాయి. ఈ అంశంపై తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి సమీక్షించారు. మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ లాంటి జిల్లాలకు ఈ ప్రమాదం పొంచి ఉందంటూ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి నిరోధక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు... పరిస్థితి ఎలా ఉండబోతోంది...?

నాకు తెలిసి వ్యవసాయ శాఖ పూర్తి క్షేత్రస్థాయిలోకి దిగినట్లైతే సమర్థవంతంగా నివారించుకోచ్చు. మనం మిడతల దండు నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొక మాసం వరకు కూడా ఏ ప్రాంతంలోనూ పంట ఉండదు. ఒకవేళ ఈలోపు తెలుగు రాష్ట్రాల దాకా మిడతల దండు వచ్చినట్లైతే... ఈనెల రోజులు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయలు, ఇతర పంటలు కాపులో ఉన్నాయి. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈలోగా వ్యవసాయ శాఖలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది...? రైతులను ఏ విధంగా చైతన్యం చేయాలి అందుకు మీరిచ్చే సూచనలేంటి...?

ఇప్పుడు వ్యవసాయ శాఖ మరింత బాధ్యతగా ఉంది. మిడతల దండు నివారణపై వ్యూహాలు చేరవేసి రైతుల్లో అవగాహన కల్పించాలి. నీమ్‌ బేస్డ్ బయో ఫార్ములేషన్స్ పంటను మిడతలు తినకుండా నిరోధకాలుగా పనిచేస్తాయి. కాబట్టి సిద్ధంగా ఉంచుకోమని చెప్పడంతోపాటు మరికొన్ని వ్యూహాలతో పెద్ద ఎత్తున చైతన్యవంతుల్ని చేయాల్సి ఉంది. ఒకవేళ మిడతల దండు అటువైపు వస్తుందని తెలిసినప్పుడు క్షేత్రాల్లో ఉన్న వేసవి పంటలను కాపాడుకునేందుకు నీమ్ ఆధారిత జీవ క్రిమిసంహారక మందులు ముందస్తుగా పిచికారీ చేసుకునేలా అవగాహన కల్పించాలి. ఈ ప్రక్రియ ద్వారా పంట దెబ్బతినకుండా సమర్థవంతంగా మిడతల దండు బారి నుంచి బయటపడవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద సవాల్‌, ఉపద్రవం. ఈ పరిస్థితిని ముందుగా పసిగట్టి మిడతల దండు పుట్టక, వినాశనం కోసం ఇక్రిశాట్ ఏమైనా ఆవిష్కరణలు చేసిందా...? ఆ దిశగా పరిశోధనలు ఏ మేరకు సాగుతున్నాయి?

ప్రస్తుతానికికైతే... ఇక్రిశాట్‌లో మిడతల దండుపై ఎలాంటి పరిశోధనలు సాగడం లేదు. ఇది పెద్ద సమస్య అని మేం భావిస్తే మాత్రం పరిశోధనలు ప్రారంభిస్తాం. ఇక్రిశాట్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అందుకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాలు, నిర్వహణ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై తప్పకుండా పరిశోధనలు చేయడం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details