కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలకూ లాక్డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు మార్చి 31 తేదీ వరకూ నిలిపివేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరం కాని దుకాణాలు, మాల్స్ ఇతర వాణిజ్య సంస్థలన్నీ మూసివేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అలాంటి వారిపై కఠిన చర్యలు
నిత్యావసరాలు ఎక్కువ ధరలకు విక్రయించొద్దని సీఎం జగన్ హెచ్చరించారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీని కోసం ధరల పట్టికను విడుదల చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు.
దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు నిర్వహణకు అవసరమైన స్కెలిటన్ స్టాఫ్ మాత్రమే హాజరుకావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మందిరాలు, మసీదులు, చర్చిల్లోనూ 31 తేదీ వరకూ దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అంతర్గత రవాణా కోసం వినియోగించే ఆటోలు, ట్యాక్సీలను నిలిపివేయాల్సిందిగా సూచించారు. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.