తెలంగాణలో స్వస్థలాలకు వెళ్లే వలస కూలీలపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. గతేడాది లాక్‌డౌన్ అనుభవాలు పునరావృతం కావద్దనే భయంతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను సద్వినియోగం చేసుకుంటూ స్వస్థలాల బాటపట్టారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉదయాన్నే రద్దీ నెలకొంది. ఉదయం 6 నుంచి పదిగంటలలోపే బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు... అందినకాడికి దోచుకుంటున్నారని వలసదారులు వాపోతున్నారు. బస్సు సర్వీసులు పెంచి... తాము గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
గత్యంతరం లేక..
ఉదయం 9 గంటల తర్వాత ఆర్టీసీ సేవలు నిలిపివేయటంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంతరాష్ట్ర సర్వీసులు నడపకపోవటంతో ఇతర రాష్ట్రాల వారు... ఎటు వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని వలసదారులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా అవసరానికి మించి వాహనాల్లో ఎక్కిస్తూ.. మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.