కరోనా మహమ్మారి: రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ కృష్ణా జిల్లాలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అంతటా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి.. నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు జనాలను రోడ్లపైకి పోలీసులు అనుమతిస్తున్నారు. విజయవాడలో రహదారులన్నీ బోసిగా కనిపించాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలుకు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మాత్రమే అనుమతి ఉంటుందని ఆ లోపే.. ప్రజలు కొనుగోలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరంతరం రద్దీగా ఉండే వన్‌టౌన్, పంజా సెంటర్ ప్రాంతాల్లో దుకాణాలు మూతపడటంతో రద్దీ తగ్గింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గృహనిర్బంధంలో ఉన్నవారిని ఎప్పడికప్పుడూ గమనిస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలు సహకరించాలని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి రాంచీ వెళ్తున్న మందుల వ్యాన్‌ను తనిఖీ చేయగా..అందులో ప్రయాణిస్తున్న 12 మందిని గుర్తించారు. విజయవాడ రూరల్ మండలాల్లో లాక్ డౌన్ క్రమశిక్షణ కొరవడింది. చిరువ్యాపారులంతా యథేచ్ఛగా దుకాణాలు తెరవటంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రామవరప్పాడు, నిడమానూరు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామానగర్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ క్రమశిక్షణ తప్పిన దాఖలాలు కనిపించాయి. పాయకాపురంలో రక్షణ మాస్క్‌లు లేకుండా వాహనాలపై తిరుగుతున్న వాహనదారులను ఆపిన పోలీసులు.. వారికి దండం పెట్టి... వైరస్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గన్నవరంలో రోడ్లపైకి వచ్చిన వారిని నూజివీడు ఎస్ఐ గుంజీలు తీయించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులు మండిపడ్డారు. మాస్కులు ధరించిన వారిని ఆపి..అవకాశమున్న దుస్తులను ముఖానికి అడ్డంగా ధరింపజేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. కరోనా వ్యాప్తి కాకుండా ఉండాలంటే ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని నెల్లూరు జిల్లా యంత్రాంగం ప్రచారం చేపట్టింది. సమాజానికి మేలు చేయాలంటే ఇంట్లో ఉండాలని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేశారు. నాయుడుపేట పురపాలక సంఘంలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేశారు. వెంకటగిరిలో పోలీసులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ప్రకాశం జిల్లాలో లాక్‌డౌన్‌ను ప్రజలు విజయవంతంగా పాటిస్తున్నారు. అక్కడక్కడా ప్రజలు రోడ్లపైకి వచ్చినా పోలీసులు అడ్డుకొని ఇంటికి పంపించారు. అవగాహన కార్యక్రమాల ద్వారా సామాజిక దూరం పాటించే యత్నాలు చేస్తున్నారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరులో జనసంచారం లేక రహదారులు వెలవెలబోయాయి. కర్నూలులో లాక్‌డౌన్ ప్రశాంతంగా సాగింది. నిత్యవసరాల కోసం వచ్చిన జనాలు సామాజిక దూరం పాటించారు. బద్వేలు ప్రధాన రహదారిపై ఎప్పటికప్పుడు పరిస్థితులను పోలీసులు సమీక్షించారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు బయటకు వెళ్లి వారిని ప్రశ్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో శని, ఆదివారాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
విశాఖలోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం నిత్యావసరాల కోసం ప్రజలు రైతుబజార్లకు రాగా.. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో రసాయన ద్రావణం చల్లారు. నంద్యాల నుంచి ఎనిమిది వాహనాల్లో విశాఖ వస్తున్న విద్యార్థులను అనకాపల్లిలో పోలీసులు అడ్డగించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో లాక్‌డౌన్ ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్‌డౌన్ కొనసాగించారు.
ఇవీ చదవండి:ఐపీఎల్ ఫైనల్కన్నా మోదీ 'లాక్‌డౌన్ స్పీచ్'కే అధిక రేటింగ్