ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లెపోరు... సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికలపై అదే ఉత్కంఠ. నామినేషన్ల స్వీకరణ రోజు వచ్చినా అదే అస్పష్టత. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి.. నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలూ చేయలేదు. అసలు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలూ అందలేదు. మరి నామినేషన్ల ఘట్టంలో తొలి రోజైన సోమవారం ఏం జరగబోతోంది? ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించి తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశాలున్నాయా? అని పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Local War.. Interest On Supreme court Decision
Local War.. Interest On Supreme court Decision

By

Published : Jan 25, 2021, 4:35 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.... తొలిదశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలిదశ ఎన్నికలు జరిగే ఈ పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే జిల్లాల అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలికాలేదు. రిటర్నింగ్‌ అధికారుల ఎంపికే ఇంకా జరగలేదు. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని... వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసిన ప్రభుత్వం... నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అదే ధోరణి కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గానీ, నామినేషన్లు స్వీకరించాలని గానీ, జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెళ్లలేదు.

ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆయా గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల వివరాలను రిటర్నింగ్ అధికారులు సోమవారం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ప్రకటించి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభించాలి. దీని కోసం జిల్లా, డివిజన్ పంచాయతీ కార్యాలయాల నుంచి ఆర్వోలు ఓటర్ల జాబితాలు, నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రి తీసుకుని ఆదివారమే గ్రామ పంచాయతీలకు వెళ్లాలి. కానీ అదేమీ జరగలేదు. అత్యధిక జిల్లాల్లో ఇప్పటికీ ఆర్వోలు, ఏఆర్వోల ఎంపిక పూర్తి కాలేదు. కొన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు ఆర్వోలు, ఏఆర్వోల జాబితాలు సిద్ధం చేసినా.. కలెక్టర్లు ఆమోదముద్ర వేయలేదు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఉత్తర్వులు వెళుతున్నాయి. కానీ అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు.. ఆయా జిల్లాల్లో ఏయే రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏయే మండలాల్లో ఎన్నికలు నిర్వహించవచ్చన్న సమాచారాన్ని జిల్లా కలెక్టర్లు ఎస్‌ఈసీకి అందజేశారు. ఆ తర్వాత నుంచి సహాయ నిరాకరణ మొదలైంది.

ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ శనివారం తలపెట్టిన వీడియో సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరవలేదు. ఏ మండలాల పరిధిలో ఏయే పంచాయతీలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. న్యాయపరమైన, ఇతరత్రా కారణాల వల్ల ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించడం కుదరడం లేదా..? వంటి సమాచారాన్ని, ఆయా పంచాయతీల జాబితాల్ని ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్లు పంపించాలి. ఆదివారం సాయంత్రానికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎన్నికల సంఘం కార్యాలయం మాత్రం ఆదివారం సెలవు దినమైనా పూర్తిస్థాయిలో పనిచేసింది.

ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొన్న ప్రస్తుత తరుణంలో... అందరి చూపూ సుప్రీం వైపు కేంద్రీకృతమైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండీ... సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్​ మార్పు

ABOUT THE AUTHOR

...view details