స్థానిక సమరంలో మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నామపత్రాల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. విశాఖలో జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి 84 వార్డులకుగాను 308 మంది అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేశారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు... 151 నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి 35, పార్వతీపురంలో 46, సాలూరులో 48, నెల్లిమర్ల నగరపాలక సంస్థ పరిధిలో 34 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని స్థానాల్లో అవకాశం ఇవ్వక పలువురు వైకాపా నేతలు రెబల్స్‌గా బరిలో దిగుతున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గురువారం 72 నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైకాపా, తెలుగుదేశం, జనసేన, భాజపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు కోలాహలంగా సాగింది. ఏలూరు నగరపాలక సంస్థలో గురువారం 75 నామినేషన్లు దాఖలయ్యాయి. పురపాలికల్లో నరసాపురం 62, నిడదవోలు 6, కొవ్వూరు పరిధిలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగరపంచాయతీలో రెండో రోజు 20 మంది నామపత్రాలు దాఖలు చేశారు.