కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ ఆర్థికంగా చితికిపోతున్న చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా రూ.10 వేలు రుణంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండి తోపుడు బండ్లు, రోడ్డు పక్కన అమ్మకాలు చేసుకునేవాళ్లు, చేతి వృత్తుల పనివారికి ఈ రుణాన్ని అందిస్తారు. జగనన్న తోడు పథకం కింద దరఖాస్తు చేసుకున్న చిరు వ్యాపారుల్లో చాలా మందికి బ్యాంకర్లు రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో స్త్రీనిధి ద్వారా వారికి రుణాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మే మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
చిరు వ్యాపారులకు రూ.10 వేల రుణం.. స్త్రీనిధి ద్వారా చేయూత - loan for small traders news
కరోనా కారణంగా అన్నీ రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలు రంగాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల ద్వారా సాయం అందిస్తున్నాయి. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు రుణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా సంఘంలోని ఆరుగురు మహిళలకు సమూహంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒక్కరైనా తీసుకోవచ్చు లేదా ఆరుగురు మహిళలు సమూహంగా ఏర్పడి జీవనోపాధి కోసం యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. మైక్రో విభాగం కింద రూ.25-50 వేలు, టినీ విభాగం కింద రూ.50 వేలు - లక్ష వరకు ఈ రుణాలు ఇస్తున్నారు. తాజాగా షార్ట్ టర్మ్ లోన్ విభాగం కింద రూ.10 వేల రుణాన్ని ఇస్తారు. ఈ రుణాన్ని సమూహంగా కాకుండా సంఘంలో అర్హత కలిగిన ప్రతి సభ్యురాలికి అందిస్తారు. ఇప్పటికే జగనన్నతోడు పథకం కింద లబ్ధి పొందిన వారికి రుణాన్ని ఇవ్వరు. స్త్రీనిధి కింద తీసుకున్న రుణానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 90 పైసలకు తగ్గించారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా రుణ మంజూరులో బయోమెట్రిక్ తీసుకొస్తున్నారు. రుణం కావాల్సిన సభ్యురాలు, సంఘం వీవోఏ వేలిముద్ర ఆధారంగా రుణాన్ని అందించేలా ప్రత్యేక వ్యవస్థను తెస్తున్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ భయం..ఆలయాలకు తగ్గుతున్న భక్తులు