ఆన్‌లైన్ విధానంలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలను చేపట్టాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇంటర్ బోర్డుది ఏకపక్ష నిర్ణయమంటూ.. ఏపీ ఆన్‌లైన్ అడ్మిషన్ సిష్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీఓఏఎస్‌ఐఎస్) వ్యవస్థను తీసుకురావడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా పేర్కొనాలని అభ్యర్థిస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
గత ఏడాదిలో నిర్వహించిన విధానంలో అన్‌ఎయిడెడ్ ఇంటర్ ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించుకునేలా అనుమతివ్వాలని రమణరెడ్డి కోరారు. ఈ ఏడాది పది చదివిన 6,24,367 మంది విద్యార్థుల్లో అందరూ ఉత్తీర్ణత సాధించారని వారంతా ప్రవేశాలు పొందినా ఇంకా 3,18,641 సీట్లు మిగిలి ఉంటాయని వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలపై స్టే విధించాలని కోరారు. పాఠశాల విద్య , ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శులు , ఇంటర్మీడియట్ విద్య ప్రత్యేక కమిషనర్ , ఇంటర్ బోర్డు కార్యదర్శి , ఏపీ పాఠశాల విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.