ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రివర్గంపై కసరత్తు తుది దశకు.. సాయంత్రం గవర్నర్​కు జాబితా - New ministers List to be finalized today

New ministers List final today: మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు తుది దశకు చేరింది. మంత్రివర్గ సహచరుల కోసం...కోర్‌ కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో.. మంత్రుల పేర్లు ఖరారు చేసి సాయంత్రం గవర్నర్‌కు జాబితాను పంపనున్నారు.

New ministers List final today
New ministers List final today

By

Published : Apr 10, 2022, 5:15 AM IST

Updated : Apr 10, 2022, 3:09 PM IST

New ministers List final today: కొత్త మంత్రులపై (కొనసాగనున్న పాత మంత్రుల పేర్లూ కలిపి) కసరత్తు దాదాపు తుది దశకు చేరుకుంది. జాబితా కోసం సీఎం జగన్​ కోర్​ కమిటీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పేర్లు ఖరారయ్యాక జాబితాను గవర్నర్​కు పంపించనున్నారు. ఆ తర్వాత మంత్రులుగా ఎంపికైన వారికి సమాచారమివ్వనున్నట్లు సీఎంవో వర్గాల సమాచారం.

అలా కసరత్తు..:మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై మూడు నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఈరోజు ఉదయం నుంచి జాబితాపై కసరత్తు జరుగుతోంది. జాబితాను గవర్నర్‌కు పంపేవరకూ అందులోని పేర్లు బయటకు రాకుండా గోప్యత పాటించాలని సీఎం స్పష్టం చేశారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

ఎవరికి ఏ శాఖ..:కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీబీ) ఏర్పాటు, వాటి బాధ్యతలను మాజీ మంత్రులకు అప్పగించడం, వారికి ప్రోటోకాల్‌, అందులో న్యాయపరమైన ఆటంకాలు రాకుండా ఎలా చేయాలనే అంశాలపై విస్తృత చర్చ జరిగిందని సమాచారం. కొత్తమంత్రివర్గం కొలువుదీరాక డీడీబీలను ఖరారుచేసే అవకాశం ఉందంటున్నారు.

రేపు తేనేటి విందు..:సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్‌ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు. అది ముగిశాక.. ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొనడంతోపాటు గ్రూప్‌ ఫొటో తీయించుకుంటారు.

పాత కొత్తల కలయిక..:సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ‘పాత, కొత్తవారి కలయికలో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. పాతవారిలో 7 నుంచి 10 మంది ఉండొచ్చు, లేదా అయిదుగురే కొనసాగవచ్చు. లేదా 10-12 మంది ఉండొచ్చు.. బీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహిళల ప్రాతినిధ్యం కూడా సముచితంగా ఉంటుంది. ముందుగా కొత్త జిల్లాల ప్రాతిపదికన ప్రతీ జిల్లాకూ మంత్రి అనుకున్నా.. కొన్ని జిల్లాల్లో అవసరం ఉండట్లేదు, మరికొన్ని జిల్లాల్లో కుదరట్లేదు. ఈ నేపథ్యంలో అనుకున్నవారిలో కొందరికి పదవులు రాకపోవచ్చు. అలాగని ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. 149 మంది ఎమ్మెల్యేలూ (మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిచెందారు) ముఖ్యమంత్రి బృందమే. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి పార్టీ బాధ్యతలుంటాయి, అందరూ సమానమే. మంత్రి పదవులు వచ్చినవారు ఏమీ ఎక్కువ కాదు’ అని తెలిపారు.

సునాయాసంగానే తొలి కేబినెట్‌ కూర్పు... ఇప్పుడంత ఈజీగా లేదా..?:ముఖ్యమంత్రి జగన్‌ 2019 జూన్‌లో తొలి మంత్రివర్గ కూర్పును సునాయాసంగా చేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదంటున్నాయి వైకాపా వర్గాలు. సామాజిక సమీకరణాల దృష్ట్యా పాత మంత్రుల్లో ఒకరిద్దరిని కొనసాగించాలని ముఖ్యమంత్రి తొలుత నిర్ణయించారు. ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సూత్రప్రాయంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ‘మంత్రులంతా రాజీనామా చేయాలి. వారిలో కొనసాగించేవారితోపాటు, కొత్తవారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా’మని కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ ప్రకారమే అంతా జరిగిపోతుందని అంచనా వేశారు. కానీ, అంత సాఫీగా జరగట్లేదని దాని ప్రభావమే పాత మంత్రుల్లో ఒకరో ఇద్దరో కొనసాగుతారన్న ముఖ్యమంత్రి ప్రకటనలో మార్పు చేయాల్సిన పరిస్థితికి దారి తీసిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తొలుత ఒకరిద్దరని.. తర్వాత నలుగురైదుగురని.. ఇంకోసారి అయిదారుగురని.. మళ్లీ 10 మంది వరకు పాత వాళ్లకు అవకాశం ఉందని ఇలా పలు విధాలుగా అధికార పార్టీ నుంచి లీకులు వెలువడ్డాయి. మరోవైపు కొత్తగా చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో చేస్తున్న లాబీయింగ్‌ సీఎంపై ఒత్తిడి పెంచిందంటున్నారు.

అప్పుడు తితిదే.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ:తితిదే పాలకమండలి, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ఖరారు చేసేందుకు సీఎం గతేడాది విపరీతమైన కసరత్తే చేయాల్సి వచ్చింది. ‘మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితా సునాయాసంగా చేసుకోగలిగా కానీ, తితిదే విషయంలో మాత్రం అబ్బో..!’ అని అప్పట్లో మంత్రిమండలి సమావేశంలో సీఎం అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా కూర్పు తితిదే పాలకమండలి నియామకం కంటే సంక్లిష్టంగా మారినట్లుందని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులుగా ఉన్నవారు తిరిగి అదే పదవుల్లో కొనసాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు, సిఫార్సులు, ఇతరత్రా ఒత్తిడి ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అందువల్లే మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు.

నేటి సాయంత్రానికి కొలిక్కి!: సోమవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయాల్సి ఉంది. వారి జాబితా ఆదివారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సీఎం మార్పులు చేర్పులు చేస్తారని సీఎంవో ప్రతినిధులే చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి జాబితా ఖరారైతే అప్పుడు దాన్ని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపనున్నారు. ఆ తర్వాతనే మంత్రులు కాబోతున్న ఎమ్మెల్యేలకు ఫోన్‌ ద్వారా సమాచారమిస్తారు. ఇంత ఉత్కంఠ 2019 ఎన్నికల ముందు 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది లోక్‌సభ అభ్యర్థుల ఎంపికప్పుడు కానీ, ఇటీవల వందల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ సమయంలో కానీ కనిపించలేదని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రచారంలో ఉన్న ప్రకారం పాత మంత్రుల్లో కొనసాగే వారి పేర్లు..!: గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, నారాయణస్వామి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర నారాయణ, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిలలో అయిదారుగురికి లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంకో ఒకరిద్దరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశంఉండొచ్చంటున్నారు.

కొత్తగా మంత్రిమండలిలో అవకాశం ఉందని ప్రచారంలో ఉన్న పేర్లు..

  • ధర్మాన ప్రసాదరావు
  • కళావతి/రాజన్నదొర
  • భాగ్యలక్ష్మి/ధనలక్ష్మి
  • ముత్యాలనాయుడు/గుడివాడ అమర్నాథ్‌
  • దాడిశెట్టి రాజా/జక్కంపూడి రాజా
  • కొండేటి చిట్టిబాబు/తలారి వెంకట్రావు
  • ముదునూరి ప్రసాదరాజు/గ్రంధి శ్రీనివాస్‌
  • రక్షణ నిధి/సామినేని ఉదయభాను
  • జోగి రమేష్‌/పార్థసారథి
  • పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి/విడదల రజిని
  • కోన రఘుపతి/మేరుగ నాగార్జున
  • హఫీజ్‌ఖాన్‌/ముస్తఫా
  • సుధ/జొన్నలగడ్డ పద్మావతి
  • కాకాణి గోవర్ధన్‌ రెడ్డి
  • రోజా/భూమన కరుణాకర రెడ్డి
  • శిల్పా చక్రపాణి రెడ్డి/ఆర్థర్‌

ఇదీ చదవండి:తుడా చైర్మన్ పదవీకాలం పొడిగింపు.. మరో రెండేళ్లు కొనసాగనున్న చెవిరెడ్డి

Last Updated : Apr 10, 2022, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details