Telangana Liquor Sales in 2021: తెలంగాణ రాష్ట్రంలో 2021లో మద్యం అమ్మకాల జోరు పరంపర కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరం విక్రయాలు అత్యధికమని చెప్పొచ్చు. 2021లో అంతకుముందు ఏడాది కంటే దాదాపు రూ.కోట్లకుపైగా అధికంగా మద్యం అమ్మకాలు జరగడం సరికొత్త రికార్డు.
2021లోనే అత్యధికం..
Liquor Sales in telangana 2021 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016లో రూ.14,075 కోట్ల విలువైన 2.72 కోట్ల కేసుల లిక్కర్, 3.42 కోట్ల కేసుల బీరు అమ్ముడు పోయింది. 2020 సంవత్సరంలో తీసుకుంటే రూ.25,601.39 కోట్ల విలువైన 3.18 కోట్ల కేసులు లిక్కర్, 2.93 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. అదే 2021 సంవత్సరంలో తీసుకుంటే 30,222 కోట్ల విలువైన 3.69 కోట్ల కేసుల లిక్కర్, 3.26కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గత సంవత్సరం కంటే 4,621 కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడుపోయింది.
ఆ జిల్లాల్లో అత్యధిక విక్రయాలు..
Liquor Sales in December 2021: కరోనా ప్రభావం దాదాపు అన్ని వ్యవస్థల మీద పడినా తెలంగాణ అబ్కారీ శాఖ మీద మాత్రం పడలేదు. 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం విక్రయాలను పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7673 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగగా నల్గొండ జిల్లాలో రూ. 3,289 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్లో రూ. 3208 కోట్లు, ఆదిలాబాద్, నిజామాబాద్లు మినహా అన్ని జిల్లాల్లో రెండువేల కోట్లకు తక్కువ కాకుండా రెండున్నర వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.