liquid fertilizers cost increases: పైర్లపై పిచికారీ చేసే పురుగు, తెగుళ్లు, కలుపు మందుల ధరలు తాజాగా 8 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. నాలుగు నెలల కిందట పెరిగిన మొత్తంతో కలిపితే.. సగటున 15 నుంచి 20 శాతం వరకు చేరుకున్నాయి. దీంతో రైతుల పెట్టుబడి మరింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 3,850 టన్నుల మేర రసాయన మందులకు డిమాండు ఉంది. రూ.8వేల కోట్లకు పైనే అమ్మకాలు జరుగుతుంటాయని అంచనా. ధరల పెరుగుదల కారణంగా రైతులపై ఏటా రూ.1,200 కోట్ల అదనపు భారం పడనుంది.
ఏ మందు కొనాలన్నా రూ.500 పైమాటే..
రైతులు అధికంగా వినియోగించే అన్ని రకాల పురుగు, తెగుళ్ల మందుల ధరలు పెరిగాయి. ఏడాదిన్నర కిందట కిలో రూ.450 నుంచి రూ.500 మధ్యన లభించిన ఎసిఫేట్ ఇప్పుడు రూ.600 నుంచి రూ.700 వరకు (కంపెనీలకు అనుగుణంగా ధరలు) చేరింది. ఇమిడాక్లోప్రిడ్ ధర 11 నుంచి 12 శాతం పెరిగింది. మోనోక్రోటోఫాస్‌పైనా లీటరుకు రూ.50వరకు పెరిగింది. ఏ మందు కొనాలన్నా లీటరు రూ.500లోపు దొరకని వైనం నెలకొందని రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ ఆరంభం నాటితో పోలిస్తే లీటరుపై రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయని వివరిస్తున్నారు.
పెరుగుతున్న పెట్టుబడులు