హైదరాబాద్.. వాహనదారులు నిబంధనలు పాటించేలా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం వాహనాలను తనిఖీ చేస్తూ... నిబంధనలు అతిక్రమించే వాళ్లకు జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా కెమెరాలు చేతపట్టి ద్విచక్ర వాహనదారుల ఫోటోలు తీస్తున్నారు. శిరస్త్రాణం ధరించకపోయినా... చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడిపినా.. ఫోటోలు తీసి వాహనం నంబర్ ఆధారంగా ఇంటి చిరునామాకు చలాన్లు పంపిస్తున్నారు. రహదారులపై కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలనూ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించి, అక్కడి నుంచి 24 గంటల పాటు వాహనదారులను పర్యవేక్షిస్తున్నారు.
కఠిన నిబంధనలను పక్కాగా అమలు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలనే నిబంధన పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గతేడాది నుంచి ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధనను సైబరాబాద్లో అమలు చేస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తి శిరస్త్రాణం ధరించి... వెనకాల కూర్చున్న వ్యక్తికి లేకపోయినా జరిమానా విధిస్తున్నారు. కొంతమంది వాహనదారులు మాత్రం పోలీసుల సూచనలు పట్టించుకోవడంలేదు.
నిబంధనలు ఇంత కఠినంగా అమలు చేస్తున్నా... ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్ ధరించడం లేదని ట్రాఫిక్ ఉన్నతాధికారులు గుర్తించారు. చట్టంలో ఉన్న కఠిన నిబంధనలను పక్కాగా అమలు చేసే విధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోతే లైసెన్సు రద్దు చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వాళ్లకు 3 నెలలు, రెండో సారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే శాశ్వతంగా లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
625 ప్రమాదాలు.. 663 మంది మృతులు