ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో కేంద్ర మంత్రులకు ఇచ్చిన లేఖలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో గురువారం రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనభేరి సభ ఏర్పాట్లను ఐకాస నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. సభకు ఎంత మంది వస్తున్నారు?... ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయనే విషయాలను ఉమా అడిగి తెలుసుకున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని దేవినేని ఉమ నిలదీశారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లారన్నారు.
మరోవైపు సభకు వచ్చే వారి కోసం మందడం మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పనులు చేశారు. వంట సామగ్రి శుభ్రం చేశారు. కూరగాయలు కోశారు. ఉద్యమంలోనే కాదు.. సేవలోనూ ముందుంటామని మహిళలు చాటారు.