పెళ్లి... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. గాజులూ నగలూ పూలదండలూ పూలబొకేలూ... ఇలా పెళ్లికి ధరించినవీ వాడినవీ ఎప్పటికీ గుర్తుండేలా దాచిపెడుతుంటారు కొందరు. ఇప్పుడు వాటినో... అందమైన ఫొటో ఫ్రేములో బంధించి మరీ గోడకి అలంకరించేస్తున్నారు.
తరువాతి తరాలకు తీపి గుర్తులుగా
పెళ్లిలో ధరించే పూలమాలలు కొన్నాళ్లకే వాడిపోతాయి. అదే కర్పూరం కలగలిసిన చమ్కీ దండలయితే ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ కారణంతోనే ఒకప్పుడు పెళ్లిలో పూలమాలలతోబాటు వాటిని కూడా వేసేవారు. ఆ తరవాత తమ పెళ్లి గుర్తుగా జాగ్రత్తగా దాచిపెట్టుకునేవారు. అలాగే చాలామంది తమ పెళ్లి కార్డునీ బీరువాల్లో భద్రపరుస్తారు. మరికొందరు పెళ్లినాటి దుస్తుల్నీ, నగల్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టి తరువాతి తరాలకి అందిస్తుంటారు.
సరికొత్తగా...వినూత్నంగా
అయితే ఇప్పుడు పెళ్లంటేనే మూడు వీడియోలూ ఆరు ఫొటో ఆల్బమ్‌లూ అన్న రీతిలో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ పెరిగిపోయింది. ఒకప్పుడు పదో పాతిక ఫొటోలతో తయారయ్యే ఆల్బమ్ కాస్తా నేడు వేల ఫొటోలకి చేరి, పెళ్లి తంతులోని విభాగాల వారీగా తయారవుతోంది. అయినా ఏదో అసంతృప్తి. పెళ్లి ఫొటో ఫ్రేములో ఎక్కడో వెలితి. అందుకే పెళ్లి శుభలేఖనీ అలంకారాల్నీ పూలబొకేలతో కలగలిసిన ఫొటో ఫ్రేములకి శ్రీకారం చుట్టారు ఔత్సాహిక ఫొటో డిజైనర్లు. దాని ఫలితమే ఈ సరికొత్త పెళ్లి ఫొటో ఫ్రేములు.