కరోనా ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షల వల్ల నిమ్మ ఎగుమతి తగ్గి ధరలు పతనమయ్యాయి. గతేడాది కూడా నిమ్మ కాపు చేతికొచ్చే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో అమ్మకాలు లేక రైతులు నష్టపోయారు.
ఏప్రిల్‌లో కిలో రూ.80పైనే
ఈ ఏడాది ఏప్రిల్‌లో కిలో రూ.80-90 వరకు పలకగా.. క్రమంగా తగ్గుతూ వచ్చింది. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. నిత్యావసరాల విక్రయాల సమయాలనూ కుదించారు. దీంతో సరకు వెళ్లినా దిగుమతి జరగడం లేదు. దీంతో నిమ్మ ఎగుమతికి కీలకమైన దిల్లీ, పంజాబ్, చండీగఢ్ లాంటి రాష్ట్రాలకు రవాణా తగ్గింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మార్కెట్ నుంచి గతంలో రోజుకు 50-60 లారీలు ఎగుమతి చేయగా, ఇప్పుడు 10 లారీలే వెళ్తున్నాయి.
నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు మార్కెట్లు కూడా వారంలో మూడు రోజులే పనిచేస్తున్నాయి. ఉత్తరాదికి రవాణా తగ్గడంతో ధరలు తగ్గించేశారు. కిలోకు రూ.7-10 మాత్రమే రావడంతో గిట్టుబాటు కావట్లేదని రైతులు చెబుతున్నారు.
కోత కోస్తే నష్టమే.. అయినా
క్వింటాలు నిమ్మకాయలు కోయడానికి ముగ్గురు కూలీలు అవసరం. వీరికి రూ.600 వరకు కూలీ అవుతోంది. రవాణా, వ్యాపారి కమీషన్ కలిపితే రూ.770 వరకు అవుతుండగా.. మార్కెట్లో సగటు ధర రూ.700 మాత్రమే లభిస్తోంది. ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఆ ఖర్చులు వదులుకోవాల్సిందే. మార్చి, ఏప్రిల్ నాటి ధరలు ఉంటే.. గట్టెక్కేవాళ్లమని రైతులు చెబుతున్నారు. ఆహారశుద్ధి పరిశ్రమలు అందుబాటులో ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతరైతు చేవూరి వేణుగోపాలరెడ్డి తెలిపారు.
కోయకపోతే.. తర్వాత కాపుపై ప్రభావం
ధరల్లేవని నిమ్మకాయల్ని కోయకుండా చెట్టుకే వదిలేయలేరు. అలా చేస్తే.. తర్వాత వచ్చే కాపు తగ్గుతుంది. పండిన కాయలు రాలి కిందపడినా ఇబ్బందే. ఆమ్ల గుణం ఉండటంతో వేర్ల వ్యవస్థ దెబ్బతింటుందని పశ్చిమగోదావరి జిల్లా గోపన్నపాలేనికి చెందిన వైఎస్‌ఆర్‌ఎస్‌వీ ప్రసాద్ వివరించారు. మళ్లీ వాటిని ఏరి పక్కనే పోయాలి. అందుకే ఖర్చవుతున్నా.. కోసి మార్కెట్టుకు తరలిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:
jagananna house: వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం