కార్పొరేట్ శక్తులకే అండగా కేంద్రం: వామపక్షాలు
రాష్ట్రంలో పలుచోట్ల వామపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నాలు చేశాయి. విజయవాడలో చేపట్టిన నిరసనలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనాలోచిత, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ వామపక్ష పార్టీలు రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకో నిర్వహించాయి. కృష్ణా జిల్లా నందిగామలో నేతలు ఆందోళన చేశారు. అనంతపురం క్లాక్‌టవర్ వద్ద నిరసన చేపట్టిన సీపీఐ, సీపీఎం నేతలు... నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకుల విలీనం లాంటివి ప్రజావ్యతిరేక విధానాలు అన్నారు. పెనుకొండ నియోజకవర్గ కేంద్రం అంబేడ్కర్ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేసిన వామపక్ష నేతలు... కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు పాత బస్టాండ్‌లోనూ వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. విజయవాడ బెంజి సర్కిల్ జాతీయ రహదారి వద్ద నిర్వహించిన రాస్తారోకో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దశలవారీగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భాజపా ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తోందంటూ రామకృష్ణ ఆగ్రహించారు.