విద్యార్థులకు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అన్ని సబ్జెక్టులు తెలిసినవే. రఫ్పాడించేస్తా అనుకుంటారంతా. ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న వేస్తే.. నేనే చెప్తానంటూ.. ఒకటే గోల. మరీ పరీక్ష కేంద్రంలో మాత్రం తెల్లముఖం ఎందుకు? ఎక్కడుంది లోపం. మీకున్న కంగారే.. అనర్థాన్ని ఆహ్వానిస్తుందని గమనించారా?
అనవసరమైనవి రాయడమెందుకు..?
రాసే విధానం పట్ల స్పష్టత లేకపోతే, సబ్జెక్ట్ తెలిసి కూడా తెలియనట్లే అనిపిస్తుంది. సబ్జెక్ట్ గురించి ఎక్కువో.. తక్కువో.. మీకైతే తెలిసే ఉంటుంది కదా. మరీ భయమెందుకు.. పరీక్షా కేంద్రం గేటు దగ్గరకు వెళ్లగానే కళ్లలో నీళ్లు తిరుగుతాయెందుకు? కొందరికైతే.. ఏకంగా జ్వరం వచ్చేస్తుంది. మీకు సబ్జెక్ట్ తెలిసినపుడు భయం వదిలేస్తే.. మీరే టాపర్. మీరు దృష్టి పెట్టాల్సిందల్లా ప్రశ్నలకు సమాధానాల్ని పొందికగా రాసే(ప్రజెంటేషన్) విధానంపైనే. మీకు ఆ ప్రశ్న గురించి తెలిసే ఉంటుంది. ఆ విషయాన్ని స్పష్టంగా.. సూటిగా.. సుత్తిలేకుండా రాయండి. కొందరైతే.. ఎంత ఎక్కువ రాస్తే.. అన్ని మార్కులు వస్తాయని ఆలోచనలో ఉంటారు. పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్లకు ఆ మాత్రం తెలిసే ఉంటుంది కదా. మరీ అనవసరమైనవి రాయడమెందుకు?