Leaders on Amaravati capital issue in Supreme Court: రాజధానిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. చట్టసభల అధికారాలను ప్రశ్నించేలా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదన్నారు. కేంద్రం చేసిన చట్టానికి పార్లమెంటులోనే సవరణలు జరగాలని మాత్రమే చెప్పిందని అన్నారు. ప్రభుత్వం వేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతోందని... హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు
"రాష్ట్ర ప్రభుత్వానికి మరో భంగపాటు తప్పదు. చట్టసభలను వక్రీకరించేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. దురుద్దేశంతోనే హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేశారు. కాలయాపన చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు." -కనకమేడల రవీంద్రకుమార్
ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షల్ని సుప్రీంకోర్టు కాదనదని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రైతుల పోరాటం వృథాగా పోదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా సుప్రీంకోర్టులోనూ తీర్పు వస్తుందని తెలిపారు. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.