వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని మారిస్తే.. చెడు సంకేతాలు వెళ్తాయని రైతుల తరఫున న్యాయవాదులు వాదించారు. పరిపాలనా రాజధానిని విశాఖకు మారిస్తే... రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే... ప్రజలు బాండ్లు, విరాళాలు అందజేశారని... కేంద్రం కూడా డబ్బులు ఇచ్చిందని వివరించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... రాజధాని మార్పు అంశంపై రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా విచారణ జరిగినట్లు వివరించారు. రాజధాని కేసుల విచారణ ఈనెలాఖరు వరకూ జరుగుతుందని... డిసెంబర్ లో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.