కడప జిల్లాలో తొలివిడత పంచాయతీ ఫలితాలు కొన్నిచోట్ల ఆలస్యంగా వెలువడ్డాయి. మేజర్ పంచాయతీ కొత్తపల్లిలో సోమవారం సాయంత్రం మొదలైన ఓట్ల లెక్కింపు.. మంగళవారం మధ్యాహ్నం వరకు సాగింది. ఈ పంచాయతీలో కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అనే అభ్యర్థిపై..3 వేల 368 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉత్కంఠ రేపిన పోరుమామిళ్లలో యనమల సుధాకర్ అనే అభ్యర్థి 255 ఓట్లతో గెలిచారు. వార్డులన్నీ ప్రత్యర్థి వర్గం గెలుచుకోగా.. సర్పంచి స్థానాన్ని మాత్రం సుధాకర్ కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థుల వేధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేదంటూ వారం కిందట ఆయన ఆసుపత్రిలో కూడా చేరారు. ఇక బి.కోడూరు మండలం తుమ్మలపల్లిలో మూడుసార్లు ఓట్ల లెక్కింపు చేపట్టినా..3 ఓట్ల ఆధిక్యంలో కొప్పర్తి రామసుబ్బారెడ్డి విజేతగా నిలిచారు.
విజయోత్సవ ర్యాలీలు
విశాఖ జిల్లా అనకాపల్లి పరిధిలోని కశింకోట మండలంలో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులతో.. ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఆ తర్వాత విజేతలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ స్వయంగా డప్పు వాయించి ఉత్సాహపరిచారు.
ఉద్రిక్తత
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో..పంచాయతీ ఫలితాల తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం మద్దతుదారు 548 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించగా.. ఏడు వార్డుల్లో ఆ పార్టీ వర్గీయులు గెలిచారు. వైకాపా బలపరిచిన అభ్యర్థులు 9 వార్డుల్లో పైచేయి సాధించడంతో.. ఉప సర్పంచ్ పదవి వారికే దక్కింది. ఈ క్రమంలో ఇరు పార్టీలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. ఆ సమయంలో వైకాపా కార్యాలయంపై తెలుగుదేశం జెండాలు ప్రత్యక్షం కావడం..ఇరు వర్గాల బాహాబాహీకి దారితీసింది. తెలుగుదేశం జెండాలు తీయాలంటూ వైకాపా నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలోనే తెలుగుదేశం వర్గీయులు ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.
రీపోలింగ్
తూర్పుగోదావరి జిల్లా కందరాడలో సర్పంచ్ పదవికి శనివారం రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో 43 బ్యాలెట్ పత్రాలను కొందరు అపహరించుకుపోయారు. ఈ పరిణామంతో అప్పటివరకు ఆధిక్యంలో ఉన్న తెలుగుదేశం మద్దతుదారు సుశీల ఆందోళనకు దిగడంతో.. అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన ఘటనలో ఐదుగురిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు ఇదీ చదండి:ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం