బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2018-19లో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి.. సంబంధిత జాబితాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
10శాతం వాటాతో మూడో స్థానం..
గత అయిదేళ్లలో మొత్తంగా చూస్తే మాత్రం.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఏపీ 10% వాటా దక్కించుకొని మూడో స్థానంలో నిలిచింది. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్యలో దేశవ్యాప్తంగా రూ.7,03,103 కోట్ల విలువైన 2,112 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అందులో రూ.70 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఈ నెల బులిటెన్‌లో వెల్లడించింది.
తొలి స్థానంలో మహారాష్ట్ర
ఐదేళ్ల కాలానికి 13.6% వాటాతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని, 13.4% వాటాతో గుజరాత్ రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాలను తోసిరాజని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 10%తో మూడో స్థానాన్ని ఆక్రమించడం విశేషం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో విద్యుత్తు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రహదారులు, వంతెనలు, జలరవాణా, ఎరువులు, రసాయనాలు, సిమెంట్, మైనింగ్, క్వారీయింగ్, జౌళి, లోహపు రంగాలకు చెందినవి అత్యధికం ఉన్నాయి.
ఈ అయిదేళ్లలో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో 56% వాటాను కేవలం ఆరు రాష్ట్రాలే (ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు) దక్కించుకున్నాయి. 2018-19లో 8.2% వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2017-18లో మంజూరైన మొత్తం పెట్టుబడుల్లో ఏపీకి 9.9% వాటా రాగా మరుసటి ఏడాది 11.8%కి పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ వాటా 1.9% నుంచి 8.2%కి చేరింది.
ఇదీ చదవండి : ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..