ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులు ఇచ్చిన భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు - Amaravathi lands for latest news

అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూముల్ని విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్‌ సంస్థల కన్సార్షియం నుంచి వెనక్కి తీసుకున్న 1,600 ఎకరాల్ని విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు హైకోర్టుకు ప్రభుత్వమే తెలిపింది.

lands-for-sale-in-amaravathi-says-build-ap-director
రైతులు ఇచ్చిన భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు

By

Published : Jul 24, 2020, 6:01 AM IST

Updated : Jul 24, 2020, 6:07 AM IST

రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూముల్ని మిషన్‌ బిల్డ్‌ ఏపీలో భాగంగా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో సింగపూర్‌ సంస్థల కన్సార్షియం నుంచి వెనక్కి తీసుకున్న 1,600 ఎకరాల్ని విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు హైకోర్టుకు ప్రభుత్వమే తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన భూముల విక్రయాల్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా.. మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోర్టుకు సమర్పించిన వివరాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

రాజధానిలో అంకుర ప్రాంత (స్టార్టప్‌ ఏరియా) అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌కు చెందిన అసెండాస్‌, సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియంకి రాష్ట్ర ప్రభుత్వం 1,691 ఎకరాల్ని కేటాయించింది. ఆ ప్రాంతాన్ని సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఒప్పందాలన్నీ పూర్తయి, ప్రాజెక్టు మొదలయ్యే దశలో ప్రభుత్వం మారింది. వైకాపా అధికారంలోకి వచ్చాక, రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేయడంతో.. సింగపూర్‌ కన్సార్షియం ప్రాజెక్టు నుంచి వైదొలగాలని నిర్ణయించింది.

సింగపూర్‌ కన్సార్షియం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలో 1,600 ఎకరాల్ని మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద విక్రయించేందుకు పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎల్‌ఎల్‌ఎంసీ) సమావేశంలో నిర్ణయించారని ప్రవీణ్‌ కుమార్‌ హైకోర్టుకు తెలియజేశారు. దానికి అవసరమైన ఏర్పాట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

జైళ్ల స్థలాలూ..

విజయవాడలోని కేంద్ర కారాగారానికి చెందిన భూములతో పాటు, వివిధ నగరాల్లో నడిబొడ్డున ఉన్న జైళ్ల స్థలాలనూ విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రవీణ్‌ కుమార్‌ అఫిడవిట్‌లో తెలిపారు. స్థలాల్ని ఈ-వేలం ద్వారా, పారదర్శకంగా విక్రయిస్తున్నందున ప్రభుత్వానికి తగినంత ఆదాయం వస్తుందని ఎస్‌ఎల్‌ఎంసీ అభిప్రాయపడినట్టు పేర్కొన్నారు. వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఐకానిక్‌ వాణిజ్య సముదాయాల్ని ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో నిర్మిస్తే డిమాండ్‌ బాగుంటుందని.. కాబట్టి వాటి డిజైన్ల రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడినట్టు వెల్లడించారు.

ఇదీ చదవండీ... 'అలాంటి పరిస్థితి వస్తే మేం చూసుకుంటాం'

Last Updated : Jul 24, 2020, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details