రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల పరిధిలో.. భూముల విలువలను పెంచేందుకు కసరత్తు పూర్తయింది. ఇందుకు సంబంధించిన తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్కు అందజేయాలని... రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్.... ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి కొత్త విలువలు అమలవుతాయని భావించినప్పటికీ.. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు... నిర్ణయాన్ని వాయిదా వేశారు.
కొన్ని పట్టణాల్లో విలువలను సవరించే ప్రక్రియ ఆలస్యం అయ్యింది. మూడు దశల్లో సమాచారం క్రోడీకరించి... దాని ప్రకారం భూముల విలువలు, ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు... కసరత్తు పూర్తైందని అధికారులు.. మంత్రికి వివరించారు. ధరలను ఎంతవరకు పెంచాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చామని... పెంపు కనిష్ఠంగా పది శాతం నుంచి ఉంటుందని చెప్పారు. మార్కెట్ విలువలను సవరించేందుకు ఇప్పటివరకు వచ్చిన రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆయా ప్రాంతాల అభివృద్ధి.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.