ఆవిష్కారమవుతున్న అమరావతి కంఠాభరణాలు కళావిహీనమయ్యాయి. మా చుట్టుపక్కల నేల రాష్ట్రానికి మణిమకుటం కానుందని సంబరంగా చెప్పుకొన్న గొంతులే నేడు గోడుగోడుమంటున్నాయి. పట్నం దర్జాను పొదివి పట్టుకుంటున్న పల్లె సీమల్లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. రాజధాని నిర్మాణంలో త్యాగధనులుగా కీర్తి పొంది ఉప్పొంగిన గుండెలు ఇప్పుడు అవిసిపోతున్నాయి. రెంటికీ చెడ్డ రేవడిలా మారి రైతన్న మోము చిన్నబోతోంది. 3 రాజధానుల ప్రకటన వల్ల రాజధాని అమరావతి, సమీప పల్లెల్లో ఏర్పడిన దుర్భర పరిస్థితులివి.
ఏపీ రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాజధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రస్తావించకంటే ముందు వరకు ఎకరా రూ.30లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి. కొందరైతే బయానాగా ఇచ్చిన రూ.లక్షలను కూడా వదులుకుంటున్నారు. అమరావతి నగర పరిధిలోని 29 గ్రామాల్లో ఎకరా, అరెకరా భూములను అమ్ముకుని సమీపంలోని పల్లెటూళ్లలో భూములు కొన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇదే సమయంలో తెలంగాణలోని మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగింది. అక్కడి భూములను రైతులు అమ్ముకుని పల్నాడు ప్రాంతానికి వచ్చి తక్కువ ధరకు కొనుక్కుంటున్నారు.
సగానికి కూడా అడగడం లేదు..
‘రాజధానికి 40 కి.మీ.దూరంలో ఉండే క్రోసూరులో మూడున్నరేళ్ల కిందట ఎకరా రూ.36 లక్షల చొప్పున రెండెకరాలు కొన్నా. ఇప్పుడు ఎకరా రూ.14 నుంచి రూ.15 లక్షలూ కొనే దిక్కులేదు’ అని ఒక రైతు వివరించారు. ‘2019 జనవరిలో ఎకరం రూ.32 లక్షల చొప్పున అమ్మి పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చా. ఇప్పుడైతే ఎకరా రూ.12 లక్షలకూ అడగడం లేదు’ అని సమీప గ్రామానికి చెందిన మరో రైతు ఒకరు తెలిపారు.
తాకట్టు పెట్టి తల్లడిల్లుతూ
ఎన్నికలయ్యాక రాజధాని విస్తరణ అవకాశాలు మెరుగుపడతాయని, అప్పుడు మరింత ధర వస్తుందని రైతులు ఆశపడ్డారు. అందుకే తమ అవసరాల కోసం భూములను కుదువ పెట్టి (స్వాధీన రిజిష్టర్) ఎకరాపై రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ.వందకు రూ.2 వడ్డీ చొప్పున చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్ రుసుములనూ భరించారు. అప్పు తీర్చే సమయంలో భూముల్ని తిరిగి తమ పేరుతో రిజిష్టర్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చులనూ భరించేందుకు అంగీకరించారు. ఇంత భారీగా అప్పు అంటే పరపతి తగ్గుతుందని బయటకు చెప్పలేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. అప్పుగా తీసుకున్న మొత్తానికి కూడా భూములు అమ్ముడయ్యే పరిస్థితి లేదు. వడ్డీలు చెల్లించడమూ భారమవుతోంది. ఇక భూములపై ఆశలు వదులుకోవడమేనని వాపోతున్నారు.
విశ్వాసమే కొంపముంచింది..
రాజధానిని ప్రకటించాక భూములు కొనేందుకు ఇతర ప్రాంతాల వ్యాపారులు, వివిధ వర్గాల వారు ఇక్కడికి వచ్చారు. స్థానికులు కొందరు భూములు చూపించి కొనుగోలులో సహకరించారు. ఒకటి నుంచి రెండు శాతం వరకు కమీషన్‌గానూ పొందారు. ఇంతటితో సరిపెట్టుకోకుండా కొందరు రూ.లక్షల్లో అప్పు తెచ్చి భూములు కొని వాటిని విక్రయించడంపై దృష్టి పెట్టారు. భూముల ధరలు ఇప్పుడు సగానికి సగం తగ్గడంతో వాటిని అమ్ముకోలేక సతమతమతవుతున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఒక రైతు ఇలా రూ.20కోట్ల వరకు అప్పు చేశారు.
పల్నాడుకు తెలంగాణ రైతులు.. ఉద్యోగులు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు బాగా తగ్గడంతో పాటు ఇదే సమయంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి నుంచి 150కిలోమీటర్ల దూరంలోనే పల్నాడు ప్రాంతాలు ఉండటంతో అక్కడి ఉద్యోగులు పల్నాడు ప్రాంతంలో భూములను కొంటున్నారు. పల్నాడులో ఎకరా రూ.7 లక్షల నుంచి రూ.10లక్షల లోపు పలుకుతోంది. నల్గొండ జిల్లాలో ఎకరా అమ్ముకుని వచ్చి ఇక్కడ రెండు, మూడు ఎకరాలను కొనుక్కుంటున్నారు.