మట్టి, కంకర, గ్రావెల్... దేన్ని చూసినా కొందరు నాయకుల కళ్లు మెరుస్తున్నాయి... అక్రమంగా తవ్వేసి అప్పనంగా డబ్బు సంపాదించాలని ఆబగా అడుగేస్తున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగేసి... కాసులు కొల్లగొట్టేస్తున్నారు. కొన్నిచోట్ల కుటుంబసభ్యులు, అనుచరుల్ని ముందుపెట్టి దందా నడిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల... కప్పం నిర్ణయించి మరీ తవ్వకాలకు అనధికారిక అనుమతులిస్తున్నారు. అధికారులు దాడులకు వస్తే వారిపై తీవ్రస్థాయి ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై ‘ఈనాడు, న్యూస్‌టుడే’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందిస్తున్న కథనం.
విశాఖ పేరు చెబితే ఎర్రమట్టి దిబ్బలే గుర్తుకొస్తాయి. ఈ మట్టి దిబ్బల్ని మాఫియా జేసీబీలతో తొలిచేసింది. ఇలా తవ్వితీసిన మట్టిని భారీ వాహనాల్లో తరలించేందుకు వీలుగా ఐఎన్‌ఎస్ కళింగ నౌకాదళ స్థావరం నుంచి నేరెళ్లవలస మధ్య 3, 4 చోట్ల అక్రమంగా రోడ్లు నిర్మించింది. సమీప ప్రాంతాల్లోని లేఅవుట్ల చదును కోసమే ఈ మట్టి తరలించారన్న ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు తవ్వకాలను ఇటీవల నిలిపివేయించారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు 6 వేల ఏళ్ల కిందట ఏర్పడినవని చెబుతారు. ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. అక్రమ తవ్వకాలతో ఇప్పుడు ముప్పు ఏర్పడుతోంది.
చెరువుల్ని చెరబట్టి...
దాదాపు 300 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించే నారప్ప చెరువు ఇది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెంలో 62.72 ఎకరాల్లో విస్తరించి ఉంది. స్థానిక నాయకులు కొందరు కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ మట్టిని జేసీబీలతో తవ్వితీస్తున్నారు. రోజూ లక్షల రూపాయలు అక్రమార్కుల పరమవుతోంది. ఇష్టానుసారంగా తవ్వడంతో చెరువు మౌలిక ఆకృతి దెబ్బతింటోంది. మట్టి కోసం ఎక్కువ లోతుకు తవ్వేయడంతో చెరువు పూర్తిగా నిండనప్పుడు ఆ గోతుల్లో నీరు నిలిచిపోయి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలతో గట్టు బలహీనమవుతోంది. ఇదే మండలం రామన్నగూడెంలోని రావులచెరువుదీ ఇలాంటి పరిస్థితే.
* విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వాకాడవలస, కోమటిపల్లి, రామభద్రాపురం మండలంలోని బూసాయివలస, జీఎస్‌ఆర్ పురం, బాడంగి మండలం ముగడ చెరువుల్లో కంకర తవ్వి సమీప పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు గ్రావెల్‌ను రూ.500-600కు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొత్తసాగరం చెరువులో గ్రావెల్ తవ్వేస్తున్నారు.
కొండల్ని తవ్వేసి... ఎర్రమట్టి మింగేసి
జేసీబీతో దర్జాగా తవ్వేస్తున్న ఈ చిత్రం చూశారా? కర్నూలు జిల్లా డోన్ పరిధిలోని లక్ష్యంపల్లె కొండ ఇది. 425 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ తవ్వితీసిన ఎర్రమట్టిని ప్రైవేటు స్థిరాస్తి లేఅవుట్లకు తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వుతున్నారు. వీటికి అనుమతులు లేవు. ఇదే జిల్లా కోడుమూరులో సర్వే నంబరు 181లో 95 ఎకరాల్లో విస్తరించిన కొండను నిత్యం తవ్వేస్తూ గుల్ల చేస్తున్నారు. ట్రాక్టరు లోడు రూ.1,400-1,500 చొప్పున విక్రయిస్తున్నారు. పాణ్యంలోని తమ్మరాజుపల్లి కొండపైన ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని కొండల్ని ఇలాగే పిండి చేస్తున్నారు.
* విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టంలో త్రిశూల పర్వతంగా పేరున్న 3 కొండల్లో 41 ఎకరాల విస్తీర్ణమున్న ఓ పెద్ద కొండ చుట్టూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి గ్రావెల్, రాయిని అక్రమార్కులు తవ్వుకుపోతున్నారు. రాత్రివేళల్లో జేసీబీలతో ఈ తవ్వకాలను జరుపుతున్నారు.
* శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని అట్టలి కొండపై ఉన్న కంకరను ఇటీవల భారీగా తరలించారు. స్థానిక నాయకుల అండతో ఈ దందా సాగుతోంది. అక్రమ తవ్వకాలతో కొండ రూపే మారిపోయింది.
పారిశ్రామికవాడలకు కేటాయించిన భూముల్లోనూ..
* కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడ కోసం కేటాయించి... ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల్లో రాత్రిపూట అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
* నెల్లూరు జిల్లాకలిగిరి మండలంలో సోమశిల ఉత్తర కాలువ గట్టున ఉన్న గ్రావెల్‌ను తవ్వేసి తరలిస్తున్నారు. కావలి నియోజకవర్గం ముసునూరు, తాళ్లపాలెం చెరువుల్లో ఇష్టానుసారంగా తవ్వుతున్నారు.
* అనంతపురం జిల్లాయాడికి మండలం నగరూరు మజారాలోని చెన్నకేశవస్వామి ఆలయ మన్యం భూముల్లో నెల రోజులుగా ఇష్టానుసారం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. రెండెకరాల విస్తీర్ణంలో 15 అడుగులకు మించి లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.
* చిత్తూరు జిల్లారేణిగుంట విప్పమానుపట్టెడ పంచాయతీ పరిధిలోని సూరప్పకశం చెరువులో అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వేస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. గ్రామస్థులు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన ఉండట్లేదు.
ఊరూవాడా అక్రమ తవ్వకాలు.. ఎన్నెన్నో తార్కాణాలు
* విజయనగరం జిల్లాభోగాపురం మండలం కొండ్రాజుపాలెం సమీపంలో అనుమతించిన దాని కంటే ఎక్కువ లోతులో తవ్వకాలు చేపట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కవులవాడ సమీపంలో ఓ నాయకుడు ప్రభుత్వ భూమిలో కంకర అక్రమ తవ్వకాలను చేపట్టి వాటిని సమీపంలోని రిసార్ట్స్‌కు తరలిస్తున్నారు. నెల్లిమర్ల మండలం గరికపేట, సారిపల్లి, జగ్గరాజుపేట, బొప్పడాం, పారసాం ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పూసపాటిరేగ మండలం చినబత్తివలస సమీపంలో కొండను తవ్వేస్తున్నారు.
* విశాఖ జిల్లాపద్మనాభం మండలంలో అనుమతుల్లేకుండా రాత్రి సమయాల్లో చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అనంతవరంలోని కుంటివాని చెరువు నుంచి భారీ స్థాయిలో మట్టి తరలిపోయింది. పెందుర్తి మండలం చీమలాపల్లిలో ఎర్రకొండ నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు.
* తూర్పుగోదావరి జిల్లాతుని మండలం లోవకొత్తూరు, తేటగుంట, హంసవరం పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలు జరిపి ప్రైవేటు లేఅవుట్లను చదును చేయడానికి తరలిస్తున్నారు. తొండంగి మండలం బెండపూడి, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి శివారులోని యర్రంపాలెం రెవెన్యూ పరిధిలో డి-పట్టా భూముల్లో జగనన్న కాలనీల కోసమంటూ గ్రావెల్ తీసి తరలించారు. గండేపల్లి మండలం మురారి, తాళ్లూరు, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట తదితర గ్రామాల్లో పోలవరం కాలవగట్టు, పుష్కర కాలవగట్టును మట్టి కోసం తవ్వేశారు.
* కడప జిల్లాపుల్లంపేట మండలం దేవసముద్రం, రంగంపల్లి, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలం జిల్లెల మడక, గోవిందంపల్లి చెరువులో మట్టి దోచేస్తున్నారు. జమ్మలమడుగు మండలం గండికోటకు వెళ్లే దారిలో, కన్యతీర్థం సమీపంలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆ నాయకులకు కప్పం కట్టాల్సిందే