తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో పలుచోట్ల పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో భూములు ఇటీవల కురిసిన వర్షాలతో జలమయమయ్యాయి. చాలా చోట్లా ఇదే పరిస్థితి. ఇళ్లు కట్టకముందే ఇలా ఉంటే నిర్మాణాలు పూర్తయిన తర్వాత నివాసం ఉండటానికి వీలవుతుందా? అనే ప్రశ్న లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. ఈ స్థలాలు మాకొద్దు.. మరోచోట ఇవ్వండని లబ్ధిదారులు విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఒకసారి వరదలొస్తాయి, వాటి కోసమని స్థలాలు మార్చి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. మరీ అవసరమైతే ఎత్తు పెంచుతాం.. ఇంకోచోట స్థలాలిచ్చే ప్రసక్తే లేదంటున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్ మహానగర వాసులకు మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వానలు తగ్గి వారాలు గడిచిపోతున్నా ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే.. త్వరలో పంపిణీ చేయబోయే నివేశన స్థలాల్లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తుతుంది. ఆ సంగతి తెలిసీ.. హైదరాబాద్, ముంబయి, చెన్నై నగరాల్లో వరదలు రావడం లేదా? వాటినేమైనా మారుస్తున్నారా? అని అధికారులు ప్రశ్నిస్తుండటం విడ్డూరం.
కృష్ణాలో రోడ్డు లేదు.. వంతెనా లేదు!
విజయవాడ నగర పరిధిలోని పేదల కోసం పెనమలూరు మండలం వణుకూరులో 300, జి.కొండూరు మండలంలో 539.64 ఎకరాలు సేకరించారు. వణుకూరులో రాళ్లు పాతి చదును చేయగా వర్షాలకు బురదమయమైంది. వెలగలేరులో కొన్న 179.49 ఎకరాలను బుడమేరు ముంచెత్తడంతో పూర్తిగా నీట మునిగింది. ఈ భూముల్లోకి వెళ్లడానికి రోడ్డు లేదు. వాగు దాటి వెళ్లడానికి వంతెనా లేదు. ఓ రైల్వే అండర్‌పాస్ నుంచే దారి. ఇక్కడా నీరు చేరుతుంది. మైలవరంలోనూ ఎదురువీడు గ్రామంలో సేకరించిన భూమి నీట మునిగింది. గుడివాడ నియోజకవర్గంలో మూడు గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు నీట మునగడంతో అవి తమకొద్దని స్థానికులు ఎదురుతిరిగారు. జగ్గయ్యపేట నియోజకవర్గం రుద్రవరంలోనూ తిరస్కరించారు. వీటిని తిరస్కరిస్తే.. సంక్షేమ ఫలాలు నిలిపివేస్తామని అధికార పార్టీ స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అవనిగడ్డలో నది పొంగితే కరకట్ట లోపల ఇచ్చిన స్థలాలకు ముంపు సమస్య తలెత్తుంది.
మార్చలేం.. మెరక చేసి ఇస్తాం
కొనుగోలు చేసిన భూములను మార్చే అవకాశాలు లేవు. అవసరమైనచోట మెరక చేసి, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తాం.
- మాధవీలత, జేసీ, కృష్ణా జిల్లా
నెల్లూరులో పోటెత్తిన వరద
నెల్లూరు నగర శివారులోనూ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భగత్‌సింగ్ కాలనీ సమీపంలో 3వేల ఇళ్ల ప్లాట్లను పంపిణీకి అనువుగా మార్చారు. ఇది పెన్నా నదిని ఆనుకుని ఉంది. నది గట్టుకు ఉన్న దిబ్బల్లోని మట్టినే తవ్వి ఇళ్ల స్థలాలను చదును చేయడానికి వాడేశారు. దీంతో గత నెలలో సోమశిల జలాశయం నుంచి వరద నీటిని పెన్నా నది ద్వారా దిగువకు వదలడంతో ఇళ్ల స్థలాల్లోకి చేరింది. అప్పటికప్పుడు అధికారులు ఇసుకతో గట్టు వేసి తాత్కాలికంగా నీరు రాకుండా కట్టడి చేశారు. వెంకటగిరి గ్రామీణం, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పలుచోట్ల ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి.
వేరేచోటకు మార్చే ఉద్దేశం లేదు
నివేశన స్థలాలను వేరే ప్రాంతానికి మార్చే ఉద్దేశం లేదని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ చెప్పారు. నెల్లూరు బ్యారేజీ నుంచి ఇళ్ల స్థలాల దగ్గర వరకు కట్టను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలుగుగంగ ఈఈ విజయ్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ఎత్తు పెంచేందుకు రూ.79.70 లక్షలు!
గుంటూరు జిల్లా వేమూరులో 724 మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వడానికి 22.63 ఎకరాలను సేకరించారు. ఇందులో 1.5 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలింది రైతుల నుంచి కొనుగోలు చేశారు. సేకరించిన భూమి చుట్టూ పంటపొలాలు ఉండడం వల్ల వర్షాకాలంలో నీరు భారీగా చేరుతుంది. ఇక్కడ రెండడుగుల ఎత్తు మెరక తోలి రోడ్లు వేసి లబ్ధిదారులకు అందించాలని ప్రతిపాదించారు. ఇందుకు రూ.79.70 లక్షలు నిధులు అవసరమని అంచనా వేశారు. ఇది మాగాణి కావడంతో 2 అడుగుల ఎత్తు మెరక వేసినా అధిక వర్షాలు కురిస్తే ఇళ్లు ముంపునకు గురవుతాయి. ఇళ్ల స్థలాలకు సమీపంలోనే ఉన్న అంబేద్కర్‌నగర్ జంగాలకాలనీ ఇంతకంటే కాస్త ఎత్తులోనే ఉన్నా వానొస్తే నీటమునుగుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితులే మరికొన్నిచోట్ల నెలకొన్నాయి.
వానొస్తే మునిగినట్టే
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో 120 కుటుంబాలకు సమీపంలోని గుమడాంలో వేగావతి నది ఒడ్డున స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. వర్షాలొచ్చిన ప్రతిసారీ ఈ ప్రాంతం ముంపుబారిన పడుతోంది. దీంతో ఇక్కడికి వచ్చేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. పట్టణంలోని పెదహరిజనపేట సమీపంలో 72 ప్లాట్లకు లేఅవుట్ వేశారు. అది పూర్తిగా పల్లపుప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే చెరువవుతోంది. విజయనగరం మండలం కొండకరకాం గ్రామంలో దాదాపు 1500 మందికి స్థలాలివ్వడానికి సిద్ధం చేశారు. దీనిచుట్టూ కొండ ప్రాంతం ఉండటంతో వానొస్తే చాలు నీరంతా ఇక్కడే చేరి చెరువులా తయారవుతుంది. జామి పంచాయతీ కొండపాటివద్ద 50 మందికి స్థలాలివ్వనున్నదీ లోతట్టు ప్రాంతమే.
* పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, దెందులూరు, పోలవరం, చింతలపూడి మండలాల్లో సేకరించిన నివేశన స్థలాలు ఇటీవల వర్షాలకు ముంపునకు గురయ్యాయి.
ప్రత్యామ్నాయం చూడరా?
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూముల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. టెక్కలికి రెండు కిలోమీటర్ల దూరంలో భగవాన్‌పురం పంచాయతీ పరిధిలో చింతలగార గ్రామంలో 200 మంది పేదలకు నివేశన స్థలాలివ్వడానికి 17 ఎకరాలు సేకరించారు. దానిలో దాదాపు సగం లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇటీవల వర్షాలకు ఆ ప్రాంతంలో నీళ్లు నిలిచాయి. అక్కడ ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి లబ్ధిదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ స్థలం తమకు వారసత్వంగా వచ్చిందంటూ మధుసూదన్‌దేవ్ రాజు కుటుంబీకులు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా స్టే వచ్చింది. అయినా అధికారులు ప్రత్యామ్నాయ స్థలం ఎంపికపై దృష్టి పెట్టలేదు.
‘ఆవ’ భూములు బురదమయం
రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో ఎకరా సగటున రూ.29.40 లక్షలతో కొన్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి సమీపంలో రాజమహేంద్రవరం నగర, గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన సుమారు 25వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సేకరించిన ఆవ భూములు బురదమయ్యాయి. ఆగస్టు, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు రెండు సార్లు ఇవి నీట మునిగాయి. రైతుల నుంచి సేకరించిన 587 ఎకరాల భూమి ముంపునకు గురైంది. ఆవ భూములను మెరక చేసి ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే చుట్టుపక్కల 6 గ్రామాల్లో వేలాది ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు కోర్టులో పిల్ వేశారు. ఏలేశ్వరం, మలికిపురం, సఖినేటిపల్లి, ఇతర చోట్ల భూముల్లోకి వర్షపునీరు చేరుతోంది. ఎర్రవరంలో 8.20 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించారు. రూ.2 లక్షలతో మెరక చేసినా వర్షాలకు నీరు చేరుతోంది. రాజోలులో 4.30 ఎకరాల భూమి కొన్నారు. ఇది లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపునీరు చేరి, దారి కనిపించడం లేదు.
వర్షాలు కురిస్తే నీరు నిల్వడం సహజం
భూముల ఖరారు, లబ్ధిదారుల గుర్తింపులో మార్పు చేయం. పదేళ్లకోసారి ఎప్పుడో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ సమయంలో ముంబయి, హైదరాబాద్, చెన్నై మహానగరాల్లోనూ సమస్యలొస్తున్నాయి. అలాగని వాటిని మార్చే పరిస్థితి లేదు కదా. తూర్పుగోదావరి జిల్లా భౌగోళిక స్వరూపం ప్రకారం వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ ఉండడం సహజం. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాక వాన నీరు నిల్వ ఉండదు. సమస్యలున్నచోట భూములను మెరక చేస్తాం. లబ్ధిదారులు ఆందోళన చెందనక్కర్లేదు. -డి.మురళీధర్‌రెడ్డి, కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా
కర్నూలులో.. నీళ్లల్లో నిల్చుని నిరసన
కర్నూలు జిల్లాలో కొన్నిచోట్ల కొండలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్లాట్లు వేేసి సరిహద్దు రాళ్లు పాతారు. చిన్నపాటి వర్షాలకే ప్లాట్లన్నీ నీట మునుగుతున్నాయి. దేేవనకొండ, బనగానపల్లి, నంద్యాల, పాములపాడు, బండిఆత్మకూరు పరిధిలో ఈ పరిస్థితి ఉంది. దీంతో లబ్ధిదారులు నీళ్లల్లో నిలబడి పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. పత్తికొండ పట్టణ శివారులోని ఆదోని-గుత్తి బైపాస్ ప్రధాన రహదారి పక్కనే పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రాంతం చిన్నవానకే నీరు చేరి నీటి కుంటలా మారుతోంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నంద్యాల పరిధిలోని చాపిరేవుల, కానాల లబ్ధిదారులకు ఇచ్చే స్థలాలు కుందు, వాగులకు దగ్గరగా ఉన్నాయని మార్చి వేరేచోట ఇవ్వాలంటూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. భూముల ఖరారులో మార్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:
ఆ 6 జిల్లాల్లోనూ ఆరోగ్య శ్రీ విస్తరణ సేవలు..ఇవాళే ముహుర్తం