ఎంపీడీవో పదోన్నతుల్లో చేతులు మారిన లక్షల రూపాయలు - ఎంపీడీవో పదోన్నతుల్లో చేతులు మారిన లక్షల రూపాయలు వార్తలు
MPDO promotions ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎంపీడీవోల పదోన్నతుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. అడిగిన చోట సీటు కావాలంటే అడిగినంత ముట్టచెప్పుకోవాల్సిందేనని ప్రచారం జరిగింది. కీలక పోస్టులు దక్కించుకున్నవారికి ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం
ఎంపీడీవో పదోన్నతుల్లో చేతులు మారిన లక్షల రూపాయలు
By
Published : Aug 14, 2022, 3:44 AM IST
MPDO promotions పదోన్నతులు పొందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల్లో (ఎంపీడీవో) కొందరిని కీలక పోస్టుల్లో నియమించడం వెనక లక్షలాది రూపాయలు చేతులు మారాయనీ, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారందరికీ అడిగిన చోట అడిగినట్లుగా నియమించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీలోని ఒకరిద్దరు తెరవెనక ఉండి చక్రం తిప్పినట్లు సమాచారం. పోస్ట్ ప్రాధాన్యం బట్టి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో 237 మంది ఎంపీడీవోలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. వీరిలో పలువురికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు(జడ్పీ సీఈవో)గా, జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా) పథక సంచాలకులు(పీడీ)గా, జడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, జిల్లా పంచాయతీ అధికారులు(డీపీవో)గా పోస్టింగ్‌లు ఇవ్వడం వెనుక పెద్ద ‘కథే’ నడిచింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డ్వామా పీడీలుగా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఎంపీడీవో జీతంపై పని చేస్తున్న పలువురు అదే చోట కొనసాగేలా పెద్దఎత్తున పైరవీలు చేసుకున్నారు. జిల్లా మంత్రులతో సిఫార్సు చేయించుకోవడం, అవసరమైన చోట సొమ్ములు సమర్పించుకున్నారు. మూడు జిల్లాల్లో జడ్పీ సీఈవోలు, నాలుగు జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలు, మూడు జిల్లాల్లో డ్వామా పీడీలు అదే చోట కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవోల్లో ఇద్దరు ముగ్గురు అదే జిల్లాల్లో సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వహించేలా ఉత్తర్వులు తెచ్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. నాలుగు జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులను కూడా అదే స్థానాల్లో కొనసాగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులిచ్చింది.
డబ్బులు ఇవ్వని వారి పేర్లు జాబితా నుంచి తొలగింపు!:పదోన్నతులు పొందిన ఎంపీడీవోలకు సీనియారిటీపై ఎక్కడెక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలో ప్రాథమికంగా ఒక జాబితా తయారైంది. దీని ఆధారంగా మంత్రి పేషీలోని కొందరు సంబంధిత ఎంపీడీవోలకు ఫోన్లు చేసి ప్రతిపాదిత పోస్టింగ్ ఇవ్వాలంటే కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలు చెల్లించాలని రాయబేరాలు సాగించారన్న ఆరోపణలు వినవచ్చాయి. డబ్బులు ఇవ్వలేమన్న వారందరి పేర్లు జాబితాల్లో నుంచి పక్కన పెట్టి, ముందుకొచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు జూనియర్లను ప్రాధాన్యం గల స్థానాల్లో నియమించారు. రెండున్నర దశాబ్దాల నిరీక్షిణ తరువాత పదోన్నతులు కల్పించినందుకు సంతోషించాలో, పైరవీకారులకే కీలక పోస్టింగ్‌లు ఇవ్వడంపై బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పైరవీలు చేసుకోలేని, అడిగిన డబ్బు ఇవ్వలేని వారిలో చాలామందికి ప్రాధాన్యం లేని పోస్టింగులు ఇచ్చారు. ఇతర ప్రభుత్వశాఖల్లో, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో పోస్టింగుల పొందిన వారిలో చాలా మంది ఇదే కోవకు చెందుతారు. మంత్రి పేషీ సిఫార్సు చేసిన వారికే సంబంధిత ఉన్నతాధికారులు కీలక పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం.
ప్రాంతానికో నేత పైరవీలు..
రాయలసీమలో ఎంపీడీవో ఒకరు జడ్పీ సీఈవోగా చాలాకాలంగా పని చేస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పించి అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పదోన్నతులు పొందిన ఎంపీడీవోల్లో ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ... జిల్లా మంత్రి, అదే ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో ఆయన్నే కొనసాగించారు.
ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో డ్వామా పథక సంచాలకులు(పీడీ)గా రెండున్నరేళ్లుగా పని చేస్తున్న ఎంపీడీవో ఒకరిని అదే చోట కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఒక మంత్రి మద్దతుతో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ప్రజాప్రతినిధి వద్ద ఎంపీడీవో సమీప బంధువు పని చేస్తున్నందున అక్కడి నుంచి కదిపే సాహసం చేయలేకపోయారు.
ఎంపీడీవో ఒకరిని పదోన్నతిపై కోస్తా ప్రాంతంలో ఒక జిల్లాకు జడ్పీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. మంత్రి పేషీలోని ఒకరిద్దరి సహకారంతో ఆయనకు జడ్పీ సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభించింది. ఇక్కడ రెగ్యులర్ సీఈవోను నియమించాల్సి ఉన్నా...డిప్యూటీ సీఈవోకే ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు.