అక్టోబరు 13.. అర్ధరాత్రి 3 గంటల సమయం.. అప్పాచెరువు ఉప్పొంగింది. కాలనీలోకి విరుచుకుపడటంతో ఆరుగురు చనిపోయారు. దీని ఉద్ధృతికి బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. చెరువు హద్దులు గుర్తించి ఆక్రమణలను తొలగించి పరిరక్షించాల్సిన బాధ్యత నీటి పారుదల, రెవెన్యూ అధికారులపై ఉన్నా పట్టించుకోవడం లేదు.
చెరువు నీటిలోనే రోడ్లు..
గగన్‌పహాడ్ సర్వే నం.89లో 5.01ఎకరాలు.. 90లో 12.34 ఎకరాలు, 178లో 14.04 ఎకరాలు.. కలిపి 31.39 ఎకరాల్లో అప్పాచెరువు ఉంది. బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకునే ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు పట్టా భూములున్నాయంటూ సాకు చూపి అందినంత ఆక్రమించేసుకున్నారు. ఓ వ్యాపారి చెరువులోనే లే అవుట్ వేశాడు. రహదారులు నిర్మించి, ప్లాట్లు వేసి రూ.కోట్లు సంపాదించాడు. రోడ్లు, కొన్ని ఓపెన్‌ప్లాట్లు, షెడ్లు, ఇతర నిర్మాణాలు నేటికీ చెరువు నీటిలో దర్శనమిస్తున్నాయి. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు కట్ట నిర్మించిన ప్రాంతం లోపల ఇది ఉండటం గమనార్హం. అప్పాచెరువు నలుదిక్కులా 24 ఎకరాలు కబ్జాకు గురై ప్రస్తుతం 8 ఎకరాలే మిగిలింది.
హద్దులునిర్ణయించకుండానే
ఇక్కడ ఎకరా రూ.7-8 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల విలువైన స్థలం స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో చిక్కుకుంది. వర్షాల తర్వాత చెరువు కట్ట పునరుద్ధరించే సమయంలో కబ్జాదారులకు అనుకూలంగా నిర్మాణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించకుండానే కట్ట నిర్మాణం చేపట్టారు. తద్వారా యంత్రాంగమే చెరువు పరిధిని తగ్గించి చూపే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే చెరువు స్థలంలో మట్టి పోసి చదును చేసేందుకు కొందరు ప్రయత్నించారు.
ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు