Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అనేక మౌలిక వసతుల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం విద్యార్థులే ఏకంగా ఆందోళన బాటపడుతున్నారు. వీటి పరిష్కారానికి నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. 2014-15లో ట్రిపుల్ ఐటీకి 119.63కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. 71.77కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాతి ఏడాది.. 2015-16లో 93.23కోట్లు కేటాయించి.. 84.92కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండేళ్ల పాటు బాగానే నిధులిచ్చినా.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతూ వచ్చాయి. 2017-18 నుంచి సిబ్బంది వేతనాలకు మాత్రమే బొటాబొటీగా సర్కారు నిధులిస్తోంది.
ఏటా వర్సిటీ 120-164 కోట్ల వరకు ప్రతిపాదనలు సమర్పిస్తున్నా అందులో నాలుగో వంతు మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తోంది. విడుదల సమయానికి ఆ మొత్తంలో కూడా కోత పడుతోంది. 2014-15 నుంచి ప్రస్తుత బడ్జెట్ వరకు 430.51 కోట్లు కేటాయించినా విడుదల చేసింది మాత్రం రూ.294.14 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరం, కరోనా కారణంగా మూతపడిన 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలను మినహాయించి 2019-20 వరకు చూసినా బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఇవ్వలేదు. విద్యార్థులు ఆందోళనకు దిగిన తర్వాత ఇప్పటివరకు 16 కోట్లు విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.