ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లా కార్యాలయాల్లో సౌకర్యాలు కరవు - Lack of facilities

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల్లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సీనియర్‌ అధికారులు లేనిచోట జిల్లాల కలెక్టర్లు, జేసీలపై పనిభారం పెరుగుతోంది. ప్రముఖుల పర్యటనలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే విశాఖ, ఎన్టీఆర్‌, తిరుపతి తదితర జిల్లాల్లో ప్రొటోకాల్‌ విధులకు సరిపడా అధికారులు లేరు. మౌలిక వసతులు, సిబ్బంది కొరత అన్ని జిల్లాలో ఉండగా, కొన్నిచోట్ల పునర్విభజన తాలూకు బాలారిష్టాలు తొలగిపోలేదు.

జిల్లా కార్యాలయాల్లో బాలారిష్టాలు
జిల్లా కార్యాలయాల్లో బాలారిష్టాలు

By

Published : Aug 13, 2022, 7:30 AM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల్లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సీనియర్‌ అధికారులు లేనిచోట జిల్లాల కలెక్టర్లు, జేసీలపై పనిభారం పెరుగుతోంది. ప్రముఖుల పర్యటనలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే విశాఖ, ఎన్టీఆర్‌, తిరుపతి తదితర జిల్లాల్లో ప్రొటోకాల్‌ విధులకు సరిపడా అధికారులు లేరు. మౌలిక వసతులు, సిబ్బంది కొరత అన్ని జిల్లాలో ఉండగా, కొన్నిచోట్ల పునర్విభజన తాలూకు బాలారిష్టాలు తొలగిపోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు కలెక్టర్లు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తలెత్తుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి చర్యలు మందకొడిగానే సాగుతున్నాయి.
ఆర్డీవో కార్యాలయాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి వేతనాలు, బిల్లుల చెల్లింపులు జరగాలంటే డీడీవో కోడ్‌తో సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ అనుసంధానమై ఉండాలి. ఇది జరగక పలువురు ఆర్డీవోలు, సిబ్బందికి వేతనాల చెల్లింపులు ఏప్రిల్‌ నుంచి జరగడంలేదు. చిత్తూరు జిల్లా నగరి, పలమనేరు, కుప్పం ఆర్డీవోలకు జీతాలు రాలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్లలో ఏప్రిల్‌-జూన్‌ మధ్య వేతనాలు అందలేదు. బాపట్ల జిల్లా బాపట్ల డివిజన్‌, పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్‌ కార్యాలయ సిబ్బందిదీ అదే పరిస్థితి.

* బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్‌ కార్యాలయాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్ల కొనుగోలుకు నిధుల కొరత ఉంది. పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌, తూర్పుగోదావరి కలెక్టరేట్‌లోని స్పందన హాలు, వీసీ హాలు, కోనసీమ కలెక్టరేట్‌ బిల్డింగ్‌, క్యాంప్‌ ఆఫీస్‌లకు జనరేటర్‌ సౌకర్యం లేదు. ఉన్నచోట పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులకు నిధుల్లేవు.

* విశాఖకు తరచూ ప్రముఖులు, రాష్ట్ర ఉన్నతాధికారులు వస్తుండగా.. వారి పర్యటన ఏర్పాట్లు చూసేందుకు ప్రొటోకాల్‌ అధికారులు సరిపడా లేరు. వివిధ విభాగాల్లోని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. విశాఖ జిల్లాలో భూవివాదాలు ఎక్కువగా ఉండగా, కలెక్టరేట్‌లో నాలుగు సెక్షన్లే ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగంపై పనిభారం పెరుగుతోంది. విశాఖ కలెక్టరే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్నందున సర్వీసు వ్యవహారాలు, పెన్షన్‌ ప్రతిపాదనలు పరిశీలించడం భారంగా మారింది.

* తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి అదనంగా నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, పుత్తూరు, గూడూరుకు ఉప విద్యాశాఖాధికారిగా, సమగ్రశిక్ష అభియాన్‌ ఏపీవో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

అధికారులేరి?
శ్రీకాకుళంలో డ్వామా పీడీ, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌, పరిశ్రమల శాఖ జీఎం తదితర పోస్టులు 11 వరకు ఖాళీగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు రెండు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అల్లూరి జిల్లాకు ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లు, 15 మంది కంప్యూటర్‌ ఆపరేటర్ల అవసరముంది. భీమునిపట్నం డివిజన్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, డీటీ, ఇతర పోస్టులు 14 వరకు భర్తీ చేయాల్సి ఉంది. అరకులోయ, బొర్రా గుహలు, మారేడుమిల్లి, లంబసింగి, సీలేరు తదితర ప్రాంతాలకు వీఐపీల తాకిడి ఎక్కువ. ఆ మేరకు వాహనాల్లేవు. సిబ్బందీ లేరు. ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు, నందిగామ డివిజన్లలో 20 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్‌కు 16 మంది ఉద్యోగులు కావాలి. నెల్లూరులోనూ జడ్పీ, పరిశ్రమలు, మైనార్టీ, బీసీ సంక్షేమం తదితర కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేరు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్‌ (కేఆర్‌ఆర్‌సీ) పోస్టులు కేటాయించలేదు. బాపట్ల జిల్లా బాపట్ల, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఆర్డీవోతోపాటు డీటీ, జూనియర్‌ సహాయకుడు అటెండర్లను మాత్రమే నియమించారు. చీరాల, రేపల్లె డివిజన్లలోనూ ఉద్యోగుల కొరత ఉంది. మరోవైపు..బాపట్లలో హెచ్‌ఆర్‌ఏ 8% ఉండగా కొత్త జిల్లా ఏర్పడ్డాక అద్దెలు మూడింతలు పెరిగాయి. బాపట్లను టైర్‌-1 సిటీగా ప్రకటించి హెచ్‌ఆర్‌ఏ పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

* పల్నాడు జిల్లాకు చెందిన మైనార్టీ, దివ్యాంగ, ఇతర సంక్షేమ కార్యాలయాల ఇంజినీరింగ్‌ కార్యకలాపాలకు గుంటూరు జిల్లాపై ఆధారపడ్డారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు కరెంటు బిల్లుల కింద నెలకు రూ.50 వేలు, ఇతర ఆఫీసుల అవసరాలకు రూ.2.50 లక్షల చొప్పున కేటాయించాలని అధికారులు కోరారు. ప్రైవేట్‌ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నెలకు రూ.3 లక్షల వరకు అద్దెలు చెల్లిస్తున్నారు. కనిగిరి డివిజన్‌ కార్యాలయంలో మౌలిక వసతులు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ కోసం రూ.50 లక్షలు అవసరమని అంచనా వేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details