తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రౌట సంకెపల్లి గ్రామానికి చెందిన గజ్జెల రాణికి శుక్రవారం ఉదయం రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు సెల్‌ఫోన్‌లో ఏఎన్‌ఎంకు సమాచారమివ్వగా.. ఆమె 108 అంబులెన్స్‌కు విషయం తెలియజేశారు. వాహనం గ్రామానికి రాలేని పరిస్థితి. దీంతో గర్భిణిని తీసుకొని ఆమె భర్త ఎడ్లబండిపై సమీపంలోని ఆర్‌ఆర్ కాలనీకి ఉదయం 6:30కు చేరుకున్నారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని కౌటాల మండల కేంద్రం నుంచి 108 అంబులెన్స్ వచ్చేసరికి 7:30 అయింది. అప్పటికే ఆమె మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం రాణిని ఆసిఫాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తన భార్య ఆరు నెలల గర్భంతో ఉందని.. మొదటి కాన్పులోనే నెలలు నిండకముందే ఇలా ప్రసవమై, గర్భశోకం మిగిలిందని భర్త గంగు వాపోయారు.
పోరాటయోధుడు కుమురం భీం గ్రామమిది
ఆదివాసీల హక్కుల కోసం అమరుడైన పోరాటయోధుడు కుమురం భీం జన్మస్థలం రౌట సంకెపల్లి. ఇంతటి విశిష్టత కలిగిన గ్రామానికి ఇప్పటికీ రహదారి లేదు. ఏడాది క్రితం (2019, అక్టోబర్ 31) సైతం ఇదే గ్రామానికి చెందిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. రహదారి పక్కనే ప్రసవమై మృత శిశువుకు జన్మనిచ్చింది.