kunamneni sambasivarao elected as cpi state secretary సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్‌రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ఎన్నికపై అర్ధరాత్రి వరకూ వాడీవేడి చర్చలు నడిచాయి. ఇద్దరు నేతలూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్ నిర్వహించారు. కూనంనేనికి 59, పల్లా వెంకట్‌రెడ్డికి 45 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు.
అసలేం జరిగిందంటే..!తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు చాడ వెంకట్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశముంది. మూడోసారీ తనకే అవకాశం ఇవ్వాలని చాడ కోరినట్లు తెలిసింది. అయితే ఈసారి తనకు అవకాశం కల్పించాలని కూనంనేని పట్టుబట్టినట్లు సమాచారం. ఇది ఇద్దరి మధ్య పోటీకి దారితీసింది.