పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడానికి కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రైవేటు పాఠశాలకు పంపించి చదివిస్తుంటారు. అతి గారాబంగా పెంచుతూ అడిగినవన్నీ సమకూర్చుతున్నారు. కానీ తెలంగాణలోని కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(kumuram bheem collector rahul raj) మాత్రం... తన కుమార్తె(Collector daughters in anganvadi)లను అంగన్వాడీ కేంద్రానికి పంపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Collector daughters in anganvadi: అంగన్వాడీ కేంద్రానికి కలెక్టర్ పిల్లలు.. కలెక్టర్.. కుమార్తెలు నిర్విక(2), రిత్విక(4)లను జిల్లా కేంద్రంలోని జంకాపూర్ అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. మిగతా చిన్నారులతో ఆడి, పాడి సాయంత్రం వరకూ అక్కడే ఉంటున్నారు. మూడు నెలల నుంచి చిన్నారులు వస్తున్నారని.. మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ అరుణ తెలిపారు.
సర్కారు బడుల రూపు రేఖలు మారి
రాష్ట్రంలో ప్రభుత్వ బడుల(telangana government schools)పై సర్కారు కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. ప్రైవేటు బడులకు దీటుగా, కార్పొరేట్ తరహాలో డిజిటల్ విద్యావిధానానికి సైతం శ్రీకారం చుట్టారు. దాతలు, ఆదర్శ ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు కూడా మారుతున్నాయి. కరోనా మహమ్మారి తెచ్చిన సంక్షోభం సైతం.. సర్కారు బడులకు ప్రైవేటు విద్యార్థులు క్యూ కట్టేలా చేసింది. విద్యావిధానంలో మార్పులో, క్రమశిక్షణ, పరిశుభ్ర వాతావరణంతో ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందితే.. వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు బడులకు పంపించాల్సిన అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి తోడు.. ప్రభుత్వోద్యుగులు సైతం తమ పిల్లలను సర్కారు బడులకు పంపించడం ఆదర్శంగా మారింది. విద్య, వైద్య విధానం సరిగ్గా అమలైతే.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది వాస్తవం. అందుకే ప్రభుత్వాస్పత్రుల మీద సైతం ప్రజలకు నమ్మకం ఏర్పరిచేందుకు.. ఇటీవల కలెక్టర్ సతీమణి సైతం సర్కారు ఆస్పత్రిలో ప్రసవించి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గత నెల 24న ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ సైతం ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవించారు.
ఇదీ చదవండి:TDP Agitation: మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేయాలి : తెదేపా