తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr).. మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని వైద్య కళాశాల సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు కింద పడి గాయలపాలయ్యారు. సిరిసిల్ల పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వెళ్తున్న మంత్రి కేటీఆర్.. వీరిని గమనించి ఆగారు.
తన వాహన శ్రేణిలోని రెండు కార్లలో క్షతగాత్రులను ఎక్కించి.. సమీపంలోని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు. తన వ్యక్తిగత సహాయకుడు మహేందర్ రెడ్డితో పాటు ఎస్కార్ట్ పోలీసులను సైతం పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఫోన్లో సూచించారు. ప్రమాదంలో ఉన్న వారిని చూసి వెంటనే కారు ఆపి వారిని ఆసుపత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్న కేటీఆర్కు.. క్షతగాత్రుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.