తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. 'వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..' అంటూ అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ ట్విటర్‌లో సైటైర్ వేశారు. భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికీ కూడా అదే తంతు కొనసాగుతోందన్నారు. భాజపా అంటే 'బక్వాస్ జుమ్లా పార్టీ' అని తీవ్రంగా విమర్శించారు.
వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి - హరీశ్ రావు:కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సెటైరికల్‌గా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం’’ అని హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay హ్యాష్ ట్యాగ్‌లతో పాటు పక్షులు ఎగురుతూ వెళ్తున్న ఫొటోను ఆయన పోస్టు చేశారు.