ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌ కు మరో మణిహారం.. శంకుస్థాపన చేసిన కేటీఆర్‌

KTR Lays Foundation Stone for Cycle Track: ఐటీ కారిడార్‌లో సైక్లింగ్‌ చేసుకుంటూ ఆఫీస్‌కు వెళ్లే విధంగా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై సోలార్ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్​కు శ్రీకారం చుట్టామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించే విధంగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ వద్ద ఈ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

KTR
శంకుస్థాపన

By

Published : Sep 6, 2022, 5:55 PM IST

KTR Lays Foundation Stone for Cycle Track: సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ వల్ల ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగం ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే వేసవిలోగా పూర్తి చేసి నగరవాసులకు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ వద్ద ఈ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమిపూజ నిర్వహించారు. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి భూమిపూజలో పాల్గొన్నారు. మొదటి దశలో మొత్తం 23 కి.మీ మేర ఏర్పాటు చేస్తున్నామని.. 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా సోలార్‌ రూఫ్‌తో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 2023 వేసవి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

తొలుత ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని నానక్‌రాంగూడ నుంచి టీఎస్‌పీఎస్‌ వరకు 8.5 కి.మీ.. నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో 14.5 కి.మీ. మేరకు సర్వీసు రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్‌ను నిర్మించనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం విడతలవారీగా ట్రాక్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. సాధారణ సైకిల్‌ ట్రాక్‌ మాదిరిగా కాకుండా ఆధునిక వసతులతో దీనిని తీర్చిదిద్దుతున్నామన్నారు. దక్షిణ కొరియాలోని డేజియాన్‌ నుంచి సెజోంగ్‌ నగరాల మధ్య 32 కి.మీ. పరిధిలో ఆధునిక వసతులతో ఉన్న సైకిల్‌ ట్రాక్‌ను ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలించి వచ్చారని కేటీఆర్ తెలిపారు. అదేపద్ధతిలో నగరంలోని అవుటర్‌ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ ట్రాక్‌ 4.5 మీటర్ల వెడల్పు ఉంటుందని.. రెండువైపులా ఒక మీటర్‌ వెడల్పుతో పచ్చదనాన్ని తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్ వివరించారు.

'సైకిల్ ట్రాక్ వల్ల ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగం. సైకిల్ ట్రాక్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. మోడల్ డెమో కింద 50 మీటర్లు సిద్ధం చేశాం. వచ్చే వేసవిలోగా పూర్తి చేసి నగరవాసులకు అందిస్తాం. సోలార్ ప్యానల్స్ వల్ల 16 మె.వా. విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. సైకిల్ ట్రాక్‌లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఉంటాయి. ఫుడ్ కియోస్క్‌లు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు. సైకిల్ రెంటల్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు. ఫుట్‌పాత్‌లపైకి వాహనాలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సైకిల్ ట్రాక్‌ వెంబడి బారియర్లు, గ్రీన్ ప్లేస్‌ ఏర్పాటు చేస్తాం. నగరవాసుల ఆరోగ్యం కాంక్షిస్తూ, పర్యావరణహితంగా సైకిల్ ట్రాక్‌. రెండో దశలో గండిపేట చుట్టూ 46 కి.మీ. సైకిల్‌ ట్రాక్ ఏర్పాటు.'-కేటీఆర్‌, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి

కేటీఆర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details