ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KTR Tweet to Elon Musk: టెస్లాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. మస్క్‌కు కేటీఆర్‌ ట్వీట్‌ - ktr invites tesla

KTR Tweet to Elon Musk: భారత్‌ మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు.

KTR Tweet to Elon Musk
KTR Tweet to Elon Musk

By

Published : Jan 15, 2022, 5:12 PM IST

Updated : Jan 15, 2022, 5:40 PM IST

KTR Tweet to Elon Musk: భారత విపణిలోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌ మస్క్ వ్యాఖ్యలపై తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని మస్క్‌ను ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

2020లో ప్రకటన..
భారత మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌లో టెస్లా కంపెనీ ఏర్పాటుపై ఓ ట్విట్టర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కాగా భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2020లో టెస్లా ప్రకటించింది.

విజయ్‌ ట్వీట్‌..
కేటీఆర్‌ ట్వీట్‌పై సినీ హీరో విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. తెలంగాణలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని టెస్లాను ఆహ్వానించారు.

అప్పట్లోనే టెస్ట్‌ డ్రైవ్‌..
కేటీఆర్‌ 2016లోనే టెస్లా కారును నడిపారు. అమెరికాకు వెళ్లిన సందర్భంగా మోడల్‌ ఎక్స్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని చిత్రాలను అప్పట్లో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మస్క్‌ కొత్త మార్పును తీసుకొచ్చారంటూ అభినందించారు. తాజాగా ఆ ట్విటర్‌ సందేశాన్ని కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

రాయితీలు ఇవ్వలేమన్న కేంద్రం..
కాగా.. భారత్​లో టెస్లా కార్ల ప్రవేశంపై.. మస్క్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. 'ఇప్పటికీ ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు' పోస్ట్​ చేయగా.. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై మస్క్​ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సదరు ప్రభుత్వ అధికారులు విమర్శించారు. భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై దిగుమతి సుంకాన్ని తగ్గించాల్సిందిగా టెస్లా గతేడాది కోరింది. ముందు విద్యుత్‌ కార్ల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించాల్సిందిగా టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించింది. టెస్లా కోరిన రాయితీలు ఏ వాహన సంస్థకూ ఇవ్వడం లేదని, టెస్లాకు పన్ను మినహాయింపులు ఇస్తే, భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీలకు మంచి సంకేతాలు వెళ్లవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. టెస్లా కోరిన పలు రాయితీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఇదీ చదవండి:Software Cockfight : ఒకప్పుడు వద్దన్నవాళ్లే..లాభాలు చూసి సహకరిస్తున్నారు

Last Updated : Jan 15, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details